
హైదరాబాద్, సూర్య న్యూస్ : రోజువారీ ఆఫీస్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) కీలకంగా ఉపయోగపడుతుందని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఉద్యోగులు తమ విధులకు అవసరమైన ఏఐ సాధనాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా పనితీరును మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (CSTD), సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ (COEL) సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్వహించిన ఆరు రోజుల ‘కార్యాలయ పరిపాలనలో కృత్రిమ మేధస్సు’ (AI for Office Administration) శిక్షణ కార్యక్రమం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడారు.

కార్యాలయ విధుల్లో ఏఐ వినియోగం పెరగాలి
కార్యాలయ పరిపాలనలో ఏఐ సాధనాలను వినియోగించడం ద్వారా రోజువారీ విధులను సులభతరం చేయవచ్చని, సంస్థాగత కార్యకలాపాల నాణ్యతను పెంపొందించవచ్చని వీసీ పేర్కొన్నారు. అయితే పూర్తిగా ఏఐపైనే ఆధారపడటం మంచిది కాదని స్పష్టం చేశారు. ఏఐ వినియోగంతో ఎదురయ్యే సమస్యలు, ప్రమాదాలను కూడా అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరమన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను కార్యాలయ విధుల్లో ఆచరణలో పెట్టడం ద్వారా పరిపాలనా సామర్థ్యం, పనిలో నాణ్యత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
రెండు బ్యాచ్‌లుగా ఉద్యోగులకు శిక్షణ
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. శ్రీదేవి మాట్లాడుతూ, గత 15 రోజులుగా రెండు బ్యాచ్‌లలో విశ్వవిద్యాలయ ఉద్యోగులకు దశలవారీగా శిక్షణ అందించినట్లు తెలిపారు. బోధనేతర, సాంకేతిక సిబ్బందికి ప్రయోజనం చేకూరేలా రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెండు దశల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఏఐ వినియోగంపై కూర్మనాథ్ శిక్షణ
ప్రముఖ పాత్రికేయుడు, ఏఐ నిపుణుడు కూర్మనాథ్ ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమానికి ప్రధాన మెంటర్‌గా వ్యవహరించారు. కార్యాలయాల్లో నోట్ ఫైళ్లను సులభంగా రూపొందించడం, పరిపాలనా విధానాలు, సర్వీస్ రూల్స్, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఉద్యోగుల లక్షణాలు, పాటించాల్సిన నియమాలు, అధికారిక పనుల్లో ఏఐ సాధనాల వినియోగం, వాటిని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



