Skip to content
Home » ​మూసీ గర్భంలో 3 ఎకరాల ఆక్రమణ: ఆదిత్య రియల్టర్లపై కల్వకుంట్ల కవిత ఫైర్ (Video)

​మూసీ గర్భంలో 3 ఎకరాల ఆక్రమణ: ఆదిత్య రియల్టర్లపై కల్వకుంట్ల కవిత ఫైర్ (Video)

హైదరాబాద్, సూర్య న్యూస్ : మూసీ నది ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం, బడా బిల్డర్ల ఆక్రమణలను ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా ప్రశ్నించారు. గండిపేట మండలం నార్సింగి వద్ద ఆదిత్య రియల్టర్స్ (Aditya Realtors) చేపట్టిన నిర్మాణాలను ఆమె స్వయంగా పరిశీలించారు. మూసీ నది గర్భంతో పాటు బఫర్ జోన్‌లో కలిపి సుమారు 3.03 ఎకరాల భూమిని ఈ సంస్థ అక్రమంగా ఆక్రమించిందని ఆమె ఆరోపించారు.

​ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఒకవైపు సామాన్య ప్రజల నివాసాలను హైడ్రా (HYDRAA) లక్ష్యంగా చేసుకుంటుంటే, మరోవైపు నది మధ్యలోనే భారీ భవనాలు వెలుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆక్రమణల వల్ల సహజ సిద్ధమైన నాలాలు కనుమరుగయ్యాయని మరియు భవిష్యత్తులో స్థానిక నివాసితుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిత్య రియల్టర్స్ చేస్తున్న ఉల్లంఘనలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా తహశీల్దార్‌కు లేఖ రాసినా, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు.

పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని కవిత ప్రశ్నించారు. నది పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను వెంటనే కూల్చివేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ మాఫియాకు మేలు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.

కవిత ఆరోపణలకు సమాధానంగా Hydraa ఒక లేఖను విడుదల చేసింది వివరాలు 👇

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.