
- టెక్నాలజీ కాలేజీల స్టూడెంట్ల గోస
- వీసీ ఓఎస్డీకి ఏబీవీపీ వినతి
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ (సూర్య న్యూస్): ఎంతో పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. మౌలిక వసతుల లేమి, హాస్టల్ కష్టాలు, సిబ్బంది కొరత తదితర సమస్యలతో కళాశాల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఓఎస్డీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
సుమారు 1,400 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఈ కళాశాలలో కేవలం నలుగురే ప్రొఫెసర్లు ఉండటం విచారకరం. గత 30 ఏళ్లుగా ఒక్కసారి కూడా శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదు. 2006 నుంచి పలుమార్లు నోటిఫికేషన్లు విడుదలైనా, కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో పోస్టుల భర్తీ ముందుకు సాగలేదు. మొత్తం 44 మంజూరైన పోస్టులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా, ఫుడ్ టెక్నాలజీ విభాగంలో ఒక్క శాశ్వత అధ్యాపకుడు కూడా లేకపోవడం గమనార్హం. శాశ్వత బోధనా సిబ్బంది లేకపోవడంతో ఎన్బీఏ, యూజీసీ, డీఎస్టీ వంటి అత్యున్నత సంస్థల నుంచి దక్కాల్సిన గుర్తింపు, సదుపాయాలకు కళాశాల దూరమవుతోంది.
మరోవైపు కళాశాలలోని క్లాస్ రూమ్‌లు, హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరి విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 2018లోనే కొత్త భవనాలకు నిధులు మంజూరైనా నేటికీ నిర్మాణాలు నోచుకోలేదు. ఇక బాలికల హాస్టల్లో ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన గదిలో పది మంది వరకు ఉంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కార్మికులకు సరైన వేతనాలు లేకపోవడంతో సరయు, సెంటెనరీ హాస్టల్ మెస్‌లు మూతపడి విద్యార్థులు భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితిని వెంటనే చక్కదిద్దాలని ఏబీవీపీ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఓయూ అధ్యక్షుడు, కార్యదర్శి శేఖర్, నాయకులు మోక్షిత్, రాష్ట్ర టెక్నికల్ సెల్ ప్రముఖ్ డా. సుమన్ శంకర్, రాజు, దినేష్, తన్మయ్ తో పాటు పలువురు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



