100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది..
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు తలపెట్టిన కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవే.

Hyderabad, Surya News: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు (Six Guarantees) అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress Party) ప్రభుత్వం.. ఆ హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS Party) రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. ప్రభుత్వ పాలన వెయ్యి రోజులు దాటుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని పేర్కొంటూ పార్టీ శ్రేణులు ‘పోరుబాట’ (Porubata) పేరుతో నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఈ ఆందోళనలకు సన్నద్ధమవుతున్న క్రమంలో కుతుబుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఎమ్మెల్యే వివేక్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాంపేట్ సర్కిల్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ సర్కిల్ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 3న వ్యవసాయ రంగం, సాగునీరు, యూరియా కొరత, రైతు బీమా అమలు వంటి అంశాలపై రైతు సదస్సులు జరగనున్నాయి. అదే రోజు హైదరాబాద్ తదితర పట్టణ ప్రాంతాల్లో 22ఏ నిషేధిత భూముల సమస్యలపై ప్రత్యేక ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 4న మహిళలు, వృద్ధులు, వికలాంగులతో సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీల అమలు కోసం వంట వార్పు నిరసనలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 5న ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ సాధన కోసం విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6న ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో నిరసన సదస్సులు జరగనున్నాయి. అలాగే హైదరాబాద్‌లో తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతల సమస్యలపై ఆటో ర్యాలీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంపై ఆందోళనలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 7న ప్రజావాణి కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించి అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తలపెట్టిన నిరసనలకు కూడా బీఆర్‌ఎస్ పార్టీ తమ మద్దతును ప్రకటించింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



