
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రకృతి ప్రకోపానికి నేపాల్ (Nepal) అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,127కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) నేరుగా నేపాల్‌లో పర్యటించారు.
అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ‘త్రిశూలి బజార్’ ప్రాంతాన్ని సోనూసూద్ స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేపాల్‌లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహాయం అభినందనీయమని సోనూసూద్ కొనియాడారు. సమస్య కొద్ది రోజుల్లో తీరేది కాదని, మనం నిరంతరం అండగా ఉంటేనే వారు కోలుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.
సహాయక చర్యలు ముమ్మరం
నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం, రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్‌పరాసి తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన వాటిలో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరద ఉధృతికి కొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్‌లోకి కూడా కొట్టుకురావడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలకు డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించి, చట్టబద్ధంగా సైంటిఫిక్ పద్ధతుల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేపాల్ ఆర్మీ, పోలీసులతో పాటు ఏఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్లలో అహోరాత్రులు శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వరదలకు గురైన భోటే కోషి నదీ తీరంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల వద్ద చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత్, చైనా దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అంతర్జాతీయ ‘టన్నెల్ రెస్క్యూ బృందాలు’ కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



