
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు సమాచారం. 10 నుంచి 15 ఏళ్ల పాటు నిర్వహణ కోసం ఆర్టీసీ ఒక సంస్థతో అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో కార్గో విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం, సేవల ఛార్జీలపై చర్చ నెలకొంది.
సిబ్బందిని రెగ్యులర్ డ్యూటీలకు మళ్లింపు
ఇప్పటి వరకు కార్గో విభాగంలో సేవలు అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని తిరిగి సంస్థ రెగ్యులర్ బస్సు డ్యూటీల్లోకి తీసుకోనున్నారు. కార్గో కేంద్రాల్లో పనిచేస్తున్న కండక్టర్లు, ఇతర సిబ్బంది ప్రయాణీకుల సర్వీసులకు మళ్లే అవకాశం ఉంది. దీంతో కార్గో నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థ వైపు మారనుంది.
2020లో ప్రారంభమైన కార్గో సేవలు
ఆర్టీసీ కార్గో సేవలు 2020లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని బస్ స్టేషన్లు, డిపోల నెట్‌వర్క్ ద్వారా పార్సిల్, కొరియర్, కార్గో సేవలు అందించేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సరుకులు, విద్యా సంబంధిత పార్సిళ్లతో పాటు సాధారణ ప్రజల పార్సిళ్లను కూడా ఈ సర్వీసు ద్వారా రవాణా చేస్తున్నారు.
ఛార్జీల పెరుగుదలపై ఆందోళన
ఈ సర్వీసు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడంతో ఛార్జీలు పెంచే అవకాశం ఉందనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీ కార్గో ఛార్జీలు ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో చాలా మంది ఈ సేవను వినియోగిస్తున్నారు. కొత్త నిర్వహణలో రేట్లు మారతాయా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



