• ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష తీరుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు
• తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవడం సరికాదని స్పష్టీకరణ
• బీసీలకో న్యాయం, ఇతరులకో న్యాయమా అని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించిన మంత్రి

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై చర్యలు తీసుకోవాలని భావిస్తే, అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని ఆమె సంచలన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె, పార్టీ అంతర్గత వ్యవహారాలు, టికెట్ల కేటాయింపులు, బీసీల పట్ల వివక్ష తదితర అంశాలపై బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కుమార్తె వ్యాఖ్యలపై క్లారిటీ..
తన కుమార్తె మాట్లాడిన మాటలకు తనపై చర్యలు తీసుకోవడం ఏంటని కొండా సురేఖ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తమను రెచ్చగొట్టినందుకే తన కూతురు ఆయనపై విమర్శలు చేసిందని ఆమె వివరించారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెబుతున్నప్పుడు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే తన కూతురు స్పందించాల్సి వచ్చిందని సురేఖ స్పష్టం చేశారు.
పదేళ్లు నేనే సీఎం అనడం క్రమశిక్షణా రాహిత్యం కాదా?
రాబోయే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించడం పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదా అని సురేఖ నిలదీశారు. పదేళ్లు సీఎం నేనే అని చెప్పుకోవడం వల్ల క్యాబినెట్ మంత్రులు, పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి దక్కుతాయో నిర్ణయించడానికి సీఎంకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. అధిష్ఠానం తీసుకోవాల్సిన టికెట్ల నిర్ణయాన్ని సీఎం రేవంత్ ముందే బహిరంగ వేదికలపై తేల్చడం వల్లే సమస్యలు వస్తున్నాయని, అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి ఆయనకు అధికారం ఎవరు ఇచ్చారని ఆమె మండిపడ్డారు.
బీసీలకో న్యాయం.. ఇతరులకో న్యాయమా?
రేవంత్ కేబినెట్‌లోని ఇతర సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, మరి వారిపై ఏం చర్యలు తీసుకుంటారని సురేఖ నిలదీశారు. పార్టీలో చాలామంది రెడ్డి నాయకులు మాట్లాడితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. బీసీ వర్గానికి చెందిన తనకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఒకవేళ తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు..
తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన కుమార్తె వ్యాఖ్యల అంశం, టీపీసీసీ షోకాజ్ నోటీసులు, క్రమశిక్షణా కమిటీ సిఫార్సులపై వివరణ ఇచ్చానని, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరానని తెలిపారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ లభించలేదన్న ఆమె, అన్ని విషయాలను ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అధిష్ఠానం పెద్దలకు రాతపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు. ఈ వ్యవహారంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచిచూస్తున్నట్లు ఆమె తెలిపారు. సీఎం ఏకపక్ష నిర్ణయాలపై ఢిల్లీ వేదికగా కొండా సురేఖ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కాక రేపుతున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



