
హైదరాబాద్, సూర్య న్యూస్ : మొన్నటి వరకు అన్నానంటూ బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పనితీరుపై ఢిల్లీ వేదికగా ఆమె చేసిన సంచలన విమర్శల వెనుక మంత్రివర్గం నుంచి ఆమె బర్తరఫ్ ఖాయమవడమే కారణమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ స్వయంగా వెళ్లి రాఖీ కట్టారు. ఆ సమయంలో వారి మధ్య కనిపించిన ఆప్యాయత చూసి, గత కొంతకాలంగా వినిపిస్తున్న అసంతృప్తి వార్తలకు చెక్ పడిందని, వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన సురేఖ.. అనూహ్యంగా ముఖ్యమంత్రిపై, క్యాబినెట్‌లోని ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రాఖీ పండుగ నాటికి సానుకూలంగా ఉన్న పరిస్థితులు.. ఢిల్లీ పర్యటన నాటికి ఎందుకు బెడిసికొట్టాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అపాయింట్మెంట్ నిరాకరణతోనే అసహనం?
ఢిల్లీ పర్యటనలో ఉన్న సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదని స్పష్టమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆమె కలిసినప్పటికీ, పార్టీ కీలక నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ మాత్రం ఆమెకు లభించలేదు. ఈ విషయాన్ని స్వయంగా కొండా సురేఖే మీడియాతో మాట్లాడుతూ ధృవీకరించారు. అధిష్ఠానం పెద్దల నుంచి సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, కీలక నేతలు ముఖం చాటేయడంతో ఆమె అసహనానికి గురైనట్లు సమాచారం.
బర్తరఫ్ సిగ్నల్స్‌తోనే ఎదురుదాడి?
కొండా సురేఖను ఇక తన మంత్రివర్గంలో కొనసాగించేది లేదని, ఆమెను క్యాబినెట్ నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఐఎన్‌సీ (INC) పెద్దల నుంచి కూడా ఆమెకు ఎలాంటి మద్దతు లభించలేదని తెలుస్తోంది. తనను క్యాబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖరారు కావడంతోనే, సురేఖ ముందుగానే అప్రమత్తమై ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడికి దిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తనను పదవి నుంచి తప్పిస్తే దాన్ని బీసీ కార్డుతో తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే ఆమె “బీసీలకో న్యాయం, ఇతరులకో న్యాయమా?” అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయమని తనను ఎవరూ అడగలేదని ఆమె చెబుతున్నప్పటికీ, పరిణామాలు మాత్రం ఆమె బర్తరఫ్ దిశగానే సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



