
ముంబై, సూర్య న్యూస్ :భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) స్పష్టం చేశారు. అలాగే, 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కెరీర్‌పై బీసీసీఐ (BCCI) ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ రిటైర్మెంట్ ఊహాగానాలు అవాస్తవం
రోహిత్ శర్మ ఆటతీరును సైకియా ఈ సందర్భంగా కొనియాడారు. అతడు ఆడుతున్న అన్ని మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని, ఫామ్ కోల్పోకుండా సత్తా చాటుతున్నాడని గుర్తు చేశారు. అద్భుతంగా ఆడుతున్న సమయంలో అతని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే సిరీస్‌లలో జట్టు ఎలా ఆడాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశంపైనే చర్చ జరిగినట్లు సైకియా స్పష్టం చేశారు.
‘వన్ ఇయర్ వండర్’ కాకూడదు
15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ఒక చిన్న వయసు ఆటగాడిని అత్యున్నత స్థాయికి ప్రోత్సహిస్తున్నందుకు బోర్డు గర్వపడుతోందని సైకియా తెలిపారు. వైభవ్‌తో పాటు జాతీయ స్థాయిలోకి అడుగుపెడుతున్న యువ ఆటగాళ్లంతా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరహాలో సుదీర్ఘకాలం పాటు నిలకడగా ఆడాలని సూచించారు. వైభవ్ తన కెరీర్లో వేసే ప్రతి అడుగును బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. అతడు కేవలం ‘వన్ సిరీస్ లేదా వన్ ఇయర్ వండర్’గా మిగిలిపోకుండా ఉండేందుకు, అతనికి అవసరమైన సరైన మార్గదర్శకత్వం, పూర్తి మద్దతును బోర్డు అందిస్తోందని వెల్లడించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



