
హైదరాబాద్, సూర్య న్యూస్ : మానసిక వ్యాధితో బాధపడుతూ పొరపాటున రేజర్ బ్లేడ్లు మింగిన ఒక బాలుడి ప్రాణాలను ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) వైద్యులు కాపాడారు. ఎటువంటి కోత లేకుండా ఎండోస్కోపీ (Endoscopy) విధానం ద్వారా కడుపులోని బ్లేడ్ ముక్కలను అత్యంత సురక్షితంగా బయటకు తీశారు. అంతర్గత అవయవాలకు ఎలాంటి గాయాలు కాకుండా వైద్యులు ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
తాండూరులోని ఇందిరానగర్‌కు చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ కుమారుడు మహమ్మద్ రెహమాన్ (16) ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రేజర్ బ్లేడ్ ముక్కలను మింగాడు. ఈ విషయాన్ని గమనించిన తండ్రి వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఎక్స్‌రే ద్వారా పొట్టలో బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు.
ఎండోస్కోపీతో ప్రాణదానం
వెంటనే బాలుడిని మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రిఫర్ చేశారు. ఆ విభాగం అధిపతి డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో బాలుడికి అప్పర్ జీఐ ఎండోస్కోపీ నిర్వహించారు. సెడేషన్ ఇచ్చి కడుపులోని పదునైన బ్లేడ్ ముక్కలను అత్యంత జాగ్రత్తగా తొలగించారు. ఈ క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ రమేష్ బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, సివిల్ సర్జన్ ఇన్ ఛార్జి ఆర్ఎంవో డాక్టర్ కే.రాజ్ కుమార్ అభినందించారు. ఈ చికిత్సలో డాక్టర్ ఎల్.సాహిత్య, డాక్టర్ బి.ఆవికా, డాక్టర్ సయ్యద్ నదీమ్, డాక్టర్ షేక్ మహమ్మద్ ఖాసీంలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



