
హైదరాబాద్, సూర్య న్యూస్ : పాకిస్థాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల లీగ్ చరిత్రలో ఒక్క సంచలనాత్మక బ్యాటర్‌ను కూడా తయారు చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఐపీఎల్ (IPL) ద్వారా వెలుగులోకి వచ్చిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉదాహరిస్తూ.. పాక్ దేశవాళీ క్రికెట్ వ్యవస్థపై అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీఎస్‌ఎల్ ప్రారంభమై దశాబ్దం గడుస్తున్నా నాణ్యమైన బ్యాటర్లను జాతీయ జట్టుకు అందించడంలో విఫలమైందని అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. బౌలింగ్ విభాగంలో మంచి ఆటగాళ్లను వెలికితీసినప్పటికీ, గొప్ప బ్యాటింగ్ టాలెంట్ ఉన్న ప్లేయర్లను పట్టుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో వైభవ్ లాంటి కుర్రాడు దొరికాడని, పాకిస్థాన్ ఆ స్థాయికి ఎప్పటికి చేరుకుంటుందని ఆయన బోర్డును ప్రశ్నించారు. దేశంలో టెస్టు క్రికెట్ బతకాలంటే క్లబ్ క్రికెట్‌ను పునరుద్ధరించాలని, లాహోర్, కరాచీ లాంటి నగరాల్లో భారీగా నిధులు ఖర్చు చేస్తేనే నాణ్యమైన ఆటగాళ్లు పాక్ జాతీయ జట్టుకు వస్తారని అక్రమ్ సూచించారు.
ఆఫ్ఘన్ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం దక్కేనా?
ఇదిలా ఉంటే, ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్ – భారత్ మూడు టీ20ల సిరీస్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశాలు తక్కువేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జట్టులో వరల్డ్ కప్ త్రయం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి స్టార్లు ఉండటంతో వైభవ్‌కు ఛాన్స్ దక్కడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రాక్టీస్ సమయంలో ఇషాన్ కిషన్ గాయపడినట్లు సమాచారం ఉండటంతో, ఒకవేళ అతడు మ్యాచ్‌కు ఫిట్‌గా లేకపోతే వైభవ్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



