|  
FLASH NEWS
NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  • 
Skip to content

దారుణం చేసి కూడా ఇంత బలుపా? నిమ్స్‌లో బాధిత చిన్నారికి బెదిరింపులు!

ఖమ్మం, సూర్య న్యూస్ : ఖమ్మంలో 11 ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఘటనకు సంబంధించిన పోక్సో (POCSO Act) కేసులో విస్తుపోయే పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ఓవైపు తీవ్ర గాయాలతో ఆ పసికందు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో పోరాడుతుంటే.. మరోవైపు చట్టాలంటే ఏమాత్రం లెక్కలేకుండా, డబ్బు బలుపుతో నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరించడం తీవ్ర సంచలనంగా మారింది. ప్రధాన నిందితుడు మహ్మద్ గౌస్ పాషాకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పవద్దంటూ బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను నిందితుడి కుటుంబ సభ్యులు బెదిరించారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిమ్స్ ఆస్పత్రిలో బరితెగింపు.. సాక్ష్యం చెప్పొద్దని బెదిరింపులు

ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలోని ఎఫ్ బ్లాక్‌లో బాధితురాలు చికిత్స పొందుతోంది. సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం ముగ్గురు మహిళలు బాధితురాలు చికిత్స పొందుతున్న గది వద్దకు నేరుగా వచ్చారు. వారు నిందితుడు గౌస్ పాషా కుమార్తెలు మహ్మద్ అస్మా, మహ్మద్ ఆఫ్రిన్‌లతో పాటు అతని కోడలిగా బాధిత కుటుంబం గుర్తించింది. మొదట “మా వల్ల తప్పు జరిగింది” అంటూ మాట్లాడేందుకు ప్రయత్నించిన వారు.. ఆ తర్వాత గౌస్ పాషాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను బెదిరించారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక తండ్రి.. వెంటనే ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.

ప్రాణభయంతో వణికిపోతున్న పేద కుటుంబం

ఖమ్మంలో జూన్ 6న 11 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం జరగడంతో పాటు భవనం పైనుంచి కిందకు తోసేసిన ఘటన అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ కేసులో 49 ఏళ్ల గౌస్ పాషాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. దారుణానికి ఒడిగట్టడమే కాకుండా, ఇప్పుడు డబ్బు మరియు ఇతర పలుకుబడితో కేసును నీరుగార్చేందుకు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తమ కుమార్తె ప్రాణాల కోసం పోరాడుతోందని, మళ్లీ ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందోనని భయంగా ఉందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ప్రారంభంలో తమకు అండగా నిలిచిన ప్రజా, సామాజిక సంఘాలు ఈ ఆపద సమయంలోనూ తమకు అండగా నిలవాలని ఆ పేద కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp