
రాజమహేంద్రవరం, సూర్య న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) వ్యవస్థను ముగ్గురు భారతీయులు హ్యాక్ చేసి సత్తా చాటారు. ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ (Bug Bounty Program)లో పాల్గొన్న ఈ బృందం.. కేవలం 72 గంటల్లోనే వ్యవస్థలోని లోపాలను గుర్తించి నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది. ఈ హ్యాకర్ల బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్కీ మోహన్ పెదపాటి ఉండటం విశేషం. ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించినందుకు గానూ సదరు సంస్థ వీరికి రూ.6.23 లక్షల రివార్డును అందజేసింది.
ఎవరీ మోహన్ పెదపాటి?
ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యం సాధించిన మోహన్ పెదపాటి.. రాజమహేంద్రవరం పరిధిలోని కొండగుంటూరుకు చెందిన యువకుడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత అతడు ఎథికల్ హ్యాకింగ్ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. ఆసక్తితో పాటు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ‘హ్యాక్‌ట్రాన్ ఏఐ’ అనే సంస్థకు ఫౌండర్లలో ఒకరిగా ఎదిగాడు.
72 గంటల్లోనే ఛేదించి..
ఓపెన్ ఏఐ లాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించడానికి టెక్ నిపుణులు కష్టపడుతున్న సమయంలో, ఈ ముగ్గురు భారతీయ యువకులు కేవలం మూడు రోజుల్లోనే అందులోని లోపాలను పసిగట్టారు. వ్యవస్థను విజయవంతంగా హ్యాక్ చేసి అందులో ఉన్న లోపాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో సంస్థ వారిని ప్రశంసించి ఈ నగదు బహుమతిని అందజేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి చెందిన టెక్కీ తన ప్రతిభను చాటడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



