
హైదరాబాద్, సూర్య న్యూస్: దేశవ్యాప్తంగా నీట్ (NEET) లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరో కొత్త బాంబు పేల్చారు. ప్రజలంతా పనికిమాలిన విషయాలపై కొట్లాడుకుంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న అసలు శత్రువు నీట్ కాదని, వేగంగా దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలిపోతున్న ఇంట్లో కుర్చీలు ఎక్కడ సర్దుకోవాలో అని కొట్లాడుకుంటున్నట్లు ప్రస్తుత విద్యా వ్యవస్థ (Education System) తీరు ఉందని ఆయన ఎక్స్ (Twitter) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “విద్యా వ్యవస్థను చంపేయాల్సిందే” అనే శీర్షికతో ఆయన పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నీట్ గాయం మాత్రమే.. ఏఐ గొంతు కోస్తుంది
నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి వ్యవస్థకు తగిలిన చిన్న గాయాలు మాత్రమేనని వర్మ పేర్కొన్నారు. కానీ ఏఐ (AI) ఏకంగా వ్యవస్థ గొంతు కోసేస్తుందని ఆయన హెచ్చరించారు. ఒకప్పుడు కష్టపడి చదువుకుంటే జీవితాంతం స్థిరపడిపోవచ్చు అనే పాత నమ్మకాన్ని ఏఐ నడిరోడ్డుపై కాల్చి చంపిందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గుర్తుపెట్టుకోవడం, పరీక్ష రాయడం, పాస్ అవ్వడం, డిగ్రీ తెచ్చుకోవడం అనే పాత సూత్రాన్ని ఇకనైనా చింపి పారేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒక మెడికల్ విద్యార్థి ఎంబీబీఎస్ (MBBS), పీజీ (PG), సూపర్స్పెషలైజేషన్ కోసం దాదాపు 10 ఏళ్ల సమయాన్ని తగలేస్తున్నారని విమర్శించారు. ఒక డాక్టర్ పదేళ్లు కష్టపడి నేర్చుకునే విజ్ఞానాన్ని జేబులో ఉండే ఫోన్ (AI) నిమిషాల్లో చెప్పగలుగుతోందని ఆయన గుర్తుచేశారు.
కబేళాలోకి వెళ్తున్న విద్యార్థులు
ప్రస్తుతం ఇంజనీరింగ్ (Engineering), మెడిసిన్, లా (Law), సీఏ (CA), ఎంబీఏ (MBA) లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న యువత అంతా ఒక కబేళా (Slaughterhouse) లోకి నడుచుకుంటూ వెళ్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఆ కోర్సులు పూర్తి చేసే సమయానికి వారి చేతిలోని డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలుగానే మిగిలిపోతాయని చెప్పారు. ఎప్పటికీ నిద్రపోని, జీతం అడగని, సెలవులు తీసుకోని ఏఐ సిస్టమ్స్ ఆ ఉద్యోగాలను లాగేసుకుంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. భవిష్యత్తులో డయాగ్నోసిస్ అల్గారిథమిక్‌గా, సర్జరీ రోబోటిక్‌గా మారినప్పుడు మానవ డాక్టర్ కేవలం ఒక మధ్యవర్తిగా మాత్రమే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఒకే ఏఐ మెదడు డాక్టర్, లాయర్, ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్ పాత్రలను మానవుల కంటే వేగంగా, చౌకగా చేయగలదని ఆయన వివరించారు.
అజ్ఞానంలో బతుకుతున్న తల్లిదండ్రులు, టీచర్లు
“నా ఫోన్‌కి ఇప్పటికే తెలిసిన విషయాన్ని నేను ఎందుకు బట్టీ పట్టాలి?” అని ప్రశ్నించే కుర్రాడిని సమాజం విప్లవాత్మకుడిగా లేదా పిచ్చివాడిగా చూస్తోందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ (AI) ని ఎలా ఉపయోగించాలో నేర్పించడం మినహా ఇతర ఏ విధమైన విద్యకైనా ఇప్పుడు విలువ లేదని తేల్చి చెప్పారు. టీచర్లు ఇంకా “ఇది సిలబస్‌లో ఉంది” అని, తల్లిదండ్రులు “అందరూ ఇదే చేస్తున్నారు” అని చెబుతూ అజ్ఞానంలో బతుకుతున్నారని విమర్శించారు. తల్లిదండ్రులు ఇప్పటికీ పాత ర్యాంకులు, డిగ్రీల ఆధారంగా పిల్లల భవిష్యత్తును కొలిస్తే వారు పిల్లల కెరీర్ చంపేస్తున్నట్లే అని హెచ్చరించారు. సాంప్రదాయ విద్యా వ్యవస్థ ఇప్పటికే శవపరీక్ష గదిలో (Mortuary) ఉంటే, దానిని పాతిపెట్టడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఏఐతో భర్తీ కాబడతారా లేదా దానిని శాసిస్తారా అనేది మాత్రమే మన ముందున్న ఆప్షన్ అని వర్మ స్పష్టం చేశారు.
సూర్య న్యూస్ విశ్లేషణ: అప్డేట్ అవ్వకపోతే అవుట్‌డేట్ అవుతాం
రామ్ గోపాల్ వర్మ ఉపయోగించిన తీవ్రమైన పదజాలం లేదా శైలితో మనలో చాలామంది ఏకీభవించకపోవచ్చు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Technology) యుగంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది అక్షర సత్యం. కేవలం మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్ల కోసమే చదివే పాత చింతకాయ పచ్చడి రోజులు చెల్లిపోయాయి. లీగల్ కాంట్రాక్టులు రాయడం, అకౌంట్స్ ఆడిట్ చేయడం, సాఫ్ట్వేర్ కోడింగ్ రాయడం లేదా రోగ నిర్ధారణ చేయడం వంటి ప్రొఫెషనల్ పనులను ఏఐ (AI) చిటికెలో మన కళ్లముందు ఉంచుతోంది.
ఈ తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సాంప్రదాయ బట్టీ చదువుల కంటే, ఏఐ టెక్నాలజీని జీవితానికి, వృత్తికి ఎలా అన్వయించుకోవాలో పిల్లలకు నేర్పించాలి. ఇప్పటికే ప్రభుత్వాలు సైతం విద్యా విధానంలో, పరీక్షల నిర్వహణలో మార్పులు తీసుకురావాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. కాలానుగుణంగా అప్డేట్ అయిన టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తేనే మన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే వర్మ చెప్పినట్లు సర్టిఫికెట్లు కేవలం కాగితపు ముక్కలుగానే మిగిలిపోతాయి.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




