
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కేజీఎఫ్’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా సీనియర్ నటుడు అనంత్ నాగ్‌ను (Anant Nag) అత్యున్నత సినీ పురస్కారం వరించింది. 2024 సంవత్సరానికి గాను ఆయనకు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును (Dadasaheb Phalke Award) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సుదీర్ఘ, విశేష సేవలను గుర్తిస్తూ ఈ అత్యున్నత జీవితకాల పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో అనంత్ నాగ్ 300కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందిన ఆయన.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ, ఆంగ్ల భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. 1973లో సంకల్ప చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన అంకుర్, మంథన్, భూమిక, కల్యుగ్ వంటి సమాంతర సినిమాలతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. అలాగే దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ ‘మాల్గుడి డేస్’ ధారావాహిక ద్వారా కూడా విశేష ఆదరణ పొందారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు
తెలుగు చలనచిత్ర పరిశ్రమతోనూ అనంత్ నాగ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 1977లో వచ్చిన ‘ప్రేమలేఖలు’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఆయన.. అనుగ్రహం, శాంతి క్రాంతి, రాత్రి, శంఖారావం, పవన్ కల్యాణ్ చిత్రం బాలు, నితిన్ నటించిన భీష్మ చిత్రాలలో కీలక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో రచయిత ఆనంద్ ఇంగలగి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి నేటి తరానికి మరింత దగ్గరయ్యారు.
సినిమా రంగానికి చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. కాగా, భారత సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే స్మారకార్థం 1969లో ప్రారంభమైన ఈ అవార్డు కింద విజేతకు స్వర్ణ కమలం, శాలువాతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. త్వరలో జరగనున్న జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అనంత్ నాగ్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



