
ఢిల్లీ, సూర్య న్యూస్ : వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో (Bypolls) భారతీయ జనతా పార్టీ (BJP) సత్తా చాటింది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని పలు కీలక స్థానాల్లో ఎన్‌డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘన విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అస్సాంలోని నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవాశిష్ శర్మ 60 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయపథంలో దూసుకుపోతున్నారు. సుమారు 18 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 55 శాతానికి పైగా ముస్లింలే ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఇంత భారీ ఆధిక్యం లభించడం విశేషం.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోనూ ముస్లిం మెజార్టీ స్థానాల్లో కమలం పార్టీ ఘన విజయం నమోదు చేసింది. సుమారు 65 నుంచి 70 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న రెజీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ రావ్ సర్కార్ 75 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే 30 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్న నందిగ్రామ్‌లో ఆ పార్టీ అభ్యర్థి హసి రాణి రథ్ ఏకంగా లక్షకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
ప్రధాని మోదీ హర్షం
ఉప ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులు సాధించిన అద్భుత విజయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. నాగావ్, రెజీనగర్, నందిగ్రామ్ ఫలితాలు బీజేపీ-ఎన్‌డీఏ అమలు చేస్తున్న గుడ్ గవర్నెన్స్ ఎజెండాతో ప్రజలకున్న లోతైన బంధాన్ని మరోసారి నిరూపించాయని ఆయన కొనియాడారు. ఈ అద్భుత ఫలితాలు తమకు అదనపు బలాన్నిచ్చాయని, గెలిచిన అభ్యర్థులు, కష్టపడిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



