
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భద్రతను పెంచాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు (Amit Shah) ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గుండాల మల్లేష్ గౌడ్ అధికారికంగా లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తమ పార్టీ అగ్రనాయకత్వానికి ప్రాణహాని ఉందని, వెంటనే కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని తగిన రక్షణ కల్పించాలని ఆయన ఆ మెమొరాండంలో విజ్ఞప్తి చేశారు.
ఫామ్‌హౌస్‌పై దాడి యత్నంతో ఆందోళన
ఇటీవల కేసీఆర్ నివాసం, ఫామ్‌హౌస్ వద్ద జరిగిన భద్రతాపరమైన పరిణామాలను మల్లేష్ తన లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యంగా ఫామ్‌హౌస్‌పై దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఉన్న భద్రతా ముప్పుపై (థ్రెట్ పర్సెప్షన్) సమగ్రంగా అంచనా వేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, భద్రతా ప్రోటోకాల్స్ ఆధారంగా వారి ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, రక్షణ కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
బీఆర్ఎస్ అగ్రనేతల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, హోంశాఖకు, రాష్ట్ర డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాను కోరారు. నాయకుల ప్రాణాలకు, వారి నివాసాలకు ముప్పు వాటిల్లకుండా, వారు పాల్గొనే బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చట్టప్రకారం కఠినమైన ముందస్తు చర్యలు తీసుకునేలా చూడాలని విన్నవించారు. ఒక పౌరుడిగా, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడిగా, సామాజిక కార్యకర్తగా ఈ విషయమై తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మల్లేష్ గౌడ్ వెల్లడించారు. కేంద్రానికి పంపిన ఈ మెమొరాండం కాపీలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు తెలంగాణ డీజీపీకి కూడా ఆయన పంపించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



