
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే ఇండియా (Nestle India) కు చెందిన పిల్లల పాల ఉత్పత్తులపై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆ సంస్థకు చెందిన నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1, లాక్టోజెన్ ప్రో 1 ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలను ఉల్లంఘించడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ రెండు ఉత్పత్తుల్లోని వే ప్రొటీన్ శిశువులకు సులువుగా అరుగుతుందని నెస్లే సంస్థ ప్రమోట్ చేసుకోవడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివరణ కోరారు. శిశువుల పాల ఉత్పత్తులను లాభాల కోసం ఇలా ప్రమోట్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా సంబంధిత ఉత్పత్తులను ల్యాబ్లో పరీక్షించగా వాటిలో బయోటిన్ శాతం ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పసిపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంస్థపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. సంస్థ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



