
ఢిల్లీ, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో (AP Municipal Elections) నామినేషన్ల గడువు పెంపుపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు అందిన 19 చోట్ల నామినేషన్ల గడువు పెంచే అంశంపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు సూచించింది.
25 వరకు తుది జాబితా వద్దు
ఎన్నికల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, గడువు పొడిగించడంతో పాటు ప్రత్యామ్నాయ కేంద్రాలు, పోలీస్ భద్రత కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బాగ్చీ, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో, వివాదం నెలకొన్న ఆ 19 ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించవద్దని ఈసీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఎన్నికల్లో జోక్యం చేసుకోం.. కానీ!
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం తమకు ఇష్టం ఉండదని, అందుకే గడువు పెంచాలని నేరుగా ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అయితే, ఎన్నికలు కలుషితం కాకుండా చూసేందుకు తగిన జోక్యం అవసరమైనప్పుడు కోర్టుల చేతులు కట్టేసి ఉండవని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నింపడం ఎంతో ముఖ్యమని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



