
హైదరాబాద్, సూర్య న్యూస్: ప్రముఖ జానపద గాయని మంగ్లీ (Singer Mangli) అలియాస్ సత్యవతి చౌహాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ ఆర్థిక మోసం, బెదిరింపుల ఆరోపణలతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Punjagutta PS) ఆమెపై కేసు నమోదైంది. అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, ప్రధాన నిందితుడు రామవత్ మధు మరికొందరిపై పోలీసులు BNS సెక్షన్లు 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.
10 కోట్ల స్కామ్.. ప్రాణహాని ఉంది!
గోకులానందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Gokulanandana Infra India Pvt Ltd) పేరుతో మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి బాధితుల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగ్లీ పేరు చూసే తాము పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు డబ్బు అడిగితే తీవ్రంగా బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. “శవం కూడా దొరకకుండా చేస్తాం, యాక్సిడెంట్ చేయించి చంపుతాం” అంటూ మంగ్లీ, ఆమె సోదరుడు బెదిరించారని లాయర్ సుబ్బారావు పోలీసులకు వివరించారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
మంగ్లీ ఎదురుదాడి.. నార్సింగిలో కౌంటర్ కేసు!
ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్‌లో (Narsingi PS) కౌంటర్ ఫిర్యాదు చేశారు. సదరు లాయర్ తనను అమర్యాదగా దూషించారని, నోట్ల కట్టల వీడియోలు చూపించి బెదిరించారని ఆమె పేర్కొన్నారు. తనకు ఈ ఆర్థిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు మంగ్లీ ఫిర్యాదుపై కూడా BNS 79, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ కేసులో దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) పేరు కూడా వినిపించినప్పటికీ, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు రెండు వైపులా ఉన్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో అసలు నిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.