
దుబాయ్, సూర్య న్యూస్ : ఉమెన్స్ ఆసియా కప్‌లో (Women’s Asia Cup) దాయాది పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు (Indian Women’s Team) ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. అద్భుతమైన బౌలింగ్‌తో పాక్‌ను కేవలం 55 పరుగులకే టీమిండియా కుప్పకూల్చింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 8.4 ఓవర్లలోనే ఊదేశింది. ఈ విజయంతో గ్రూప్-ఎ లో వరుసగా మూడో గెలుపు నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
పేకమేడలా రాలిన పాక్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఓపెనర్ మునీబా అలీ 13 పరుగులు చేసింది. మరో బ్యాటర్ షవాల్ జుల్ఫికర్ 14 పరుగులు చేసింది. వీరు మినహా మిగతా వారెవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దీనితో పాక్ ఇన్నింగ్స్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే చాపచుట్టేసింది.

భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి అద్భుతంగా రాణించింది. ప్రేమ రావత్ కూడా పాక్‌కు చుక్కలు చూపించింది. శ్రీచరణి తన 4 ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ప్రేమ రావత్ 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా షెఫాలీ వర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.

సునాయాసంగా ఛేజింగ్.. సెమీస్ ఖరారు
56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ 12 పరుగులు చేసింది. స్మృతి మంధాన 9 పరుగులు చేసి ఔట్ అయింది. ప్రతికా రావత్ 4 పరుగులు చేసి వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీప్తి శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేసింది. పాక్ బౌలర్ ఫాతిమా సనాకు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో హ్యాట్రిక్ కొట్టిన భారత్ సెమీఫైనల్ చేరింది. సెమీస్‌లో శ్రీలంక లేదా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది.
యంగెస్ట్ ప్లేయర్‌గా షెఫాలీ రికార్డ్
ఈ మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన భారత ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన రికార్డు సృష్టించింది. ఉమెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. కేవలం 113 ఇన్నింగ్స్‌లలోనే ఆమె ఈ ఘనత సాధించింది. అలాగే 22 ఏళ్ల 220 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించి అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త రికార్డులకెక్కింది.


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



