
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు, మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఈశ్వర్ సాయి (Eshwar Sai) అనే వ్యక్తిపై ఆమె గత నెలలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అతడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన మాధురి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు.
ఫిర్యాదు చేసి రోజులవుతున్నా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయలేదని, అతడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాధురి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించగా తాము సకాలంలో గుర్తించి కాపాడామని వారు చెబుతున్నారు.
అజ్ఞాతంలో నిందితుడు
మరోవైపు ఈశ్వర్ సాయి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం అతడు హైకోర్టును సైతం ఆశ్రయించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈశ్వర్ సాయి భార్య శరణ్య సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు, ఆడియోలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఇరువర్గాల వాదనలు, ఆత్మహత్యాయత్నం ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
(మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారు 14416 (Tele-MANAS) హెల్ప్‌లైన్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ పొందగలరు.)

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



