
హైదరాబాద్, సూర్య న్యూస్ : బీఆర్ఎస్ ప్రముఖ నాయకుడు, BRS మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు (Police) ఫిర్యాదు చేసింది. బాధితురాలు నాంపల్లిలోని XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ (నెంబర్ 589/2026) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69, 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటర్వ్యూ పేరుతో పరిచయం..
సోమాజిగూడ దుర్గానగర్ కాలనీలోని ఉమెన్స్ పీజీలో నివసిస్తున్న 22 ఏళ్ల మీడియా రంగ బాధితురాలు తన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతారావును కలిసినట్లు తెలిపింది. ఆ తర్వాత కొత్త యూట్యూబ్ ఛానల్ (YouTube Channel) పెడతానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నట్లు ఆరోపించింది. తనకంటే 45 ఏళ్లు పెద్దవాడైన ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటానంటే నేను నమ్మలేదు. అయితే ఆయన కుటుంబంలో ఉన్న విభేదాలను చెప్పి దాన్ని ఆసరాగా చేసుకుని నమ్మించాడని ఆమె పేర్కొంది.
ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్ మెయిల్..
అమీర్‌పేటలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఫ్లాట్‌లో తాము ఇద్దరం సహజీవనం (Live-in Relationship) చేశామని బాధితురాలు వెల్లడించింది. రేగా కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆ ఫ్లాట్‌లోనే ఉండేవాడని తెలిపింది. తన వ్యక్తిగత ఫోటోలు తీసుకుని, తాను కలవడానికి నిరాకరించినప్పుడు వాటిని చూపించి బెదిరించేవాడని ఆరోపించింది. 2025 మధ్యకాలం వరకు ఈ శారీరక సంబంధం కొనసాగిందని ఆమె స్పష్టం చేసింది.
స్నేహితురాలితోనూ చనువు..
రియల్ ఎస్టేట్‌లో (Real Estate) పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి తన వద్ద నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నాడని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడని బాధితురాలు వాపోయింది. 2024 మే నెలలో తన స్నేహితురాలితోనూ ఆయన పరిచయం పెంచుకున్నట్లు గుర్తించానని తెలిపింది. తాను అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన అనుచరుల అకౌంట్ నుండి 8.5 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చారని, అయితే తన సమస్య డబ్బు కాదని ఆమె స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా సహజీవనం చేసి, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకుని మోసం చేయడమే తన ప్రధాన వేదన అని ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో షీ టీమ్స్‌కు (SHE Teams) కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. రేగా కాంతారావు లేదా ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపితేనే ఈ ఆరోపణల్లోని నిజానిజాలు తేలనున్నాయి.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




