
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : గాయపడిన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో జాతీయ జట్టులోకి తొలిసారి పిలుపు అందుకున్న భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ (Cricketer Vipraj Nigam) చుట్టూ ఊహించని వివాదాలు ముసురుకున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ యువతి అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మంగళవారం జపాన్‌లో జరిగే టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయాల్సిన తరుణంలో, ఈ యువ స్పిన్నర్‌పై కేసు నమోదు కావడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.
సోషల్ మీడియా పరిచయంతో..
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గత ఏడాది మే నెలలో విప్రజ్‌తో ఆమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ చనువుతోనే జూలై 29న తనను నోయిడాలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి శారీరకంగా దాడికి పాల్పడ్డాడని సదరు యువతి ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఆమె డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
విప్రజ్ ఇంటి ముందు ఆందోళన
క్రికెటర్‌తో నేరుగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆదివారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న విప్రజ్ ఇంటికి చేరుకుని గంటల తరబడి ఆందోళన చేపట్టింది. అయితే ప్రస్తుతం విప్రజ్ భారత జట్టుతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన అతని తండ్రి ఆమెతో ఫోన్‌లో మాట్లాడి, వారం రోజుల తర్వాత ఈ వ్యవహారంపై కూర్చుని మాట్లాడుకుందామని నచ్చజెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగింది. అనవసరంగా ఎలాంటి గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదని ఆమె మీడియాతో స్పష్టం చేసింది.
గతంలోనే ఒకరిపై ఒకరు కేసులు
ఈ వ్యవహారంలో విప్రజ్ నిగమ్, సదరు యువతి గతంలోనే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. యువతి తనను వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి ఫోన్లు చేసి తీవ్రంగా బెదిరిస్తోందని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపిస్తూ 2025 నవంబర్ 8న బారాబంకి పోలీస్ స్టేషన్‌లో విప్రజ్ ముందుగానే ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్‌గా ఆమె గౌతమ్ బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో నిగమ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసింది.
కెరీర్ పరంగా ఎదుగుతున్న తరుణంలో..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల విప్రజ్ నిగమ్ దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున 19 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్నర్, 36 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు, 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో కూడా సభ్యుడిగా ఎంపికయ్యాడు. కెరీర్ కీలక మలుపు తిరుగుతున్న సమయంలో ఈ లైంగిక ఆరోపణల వివాదం అతని భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



