
నల్గొండ, సూర్య న్యూస్ : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరుగుతున్న 45వ దక్షిణ భారత చరిత్ర సదస్సు (45th South Indian History Congress)లో తెలంగాణలోని గౌడ సామాజిక వర్గ చరిత్ర, వారి పోరాటాలపై డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ కీలక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. “Re-centering the ‘Margins’: A Critical-Historical Overview of the Emergence of the Gowda Community in Telangana” అనే అంశంపై ఆయన ఈ పత్రాన్ని ప్రదర్శించారు. తెలంగాణలో గౌడ సామాజిక వర్గ చారిత్రక ప్రస్థానం, సామాజిక-ఆర్థిక ప్రాధాన్యత, సాంస్కృతిక అస్తిత్వం, హక్కుల కోసం వారు సాగించిన పోరాటాలను డాక్టర్ ముత్యం గౌడ్ అకడమిక్ వేదికపై సవివరంగా వివరించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర
తెలంగాణలో గౌడ సామాజిక వర్గ చరిత్ర అనేది కేవలం కులవృత్తికి పరిమితం కాదని, అది ఆర్థిక స్వయంప్రతిపత్తి, సామాజిక గౌరవం, సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన గొప్ప చారిత్రక ప్రస్థానమని డాక్టర్ ముత్యం గౌడ్ తన పరిశోధనలో వివరించారు. తాటి, ఈత చెట్ల ఆధారంగా కల్లు, నీరా ఉత్పత్తి చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వారు కీలక పాత్ర పోషించారని తెలిపారు. చెట్ల పెంపకం, సంరక్షణ, గీత వృత్తిలో వారు విశిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు.
అణచివేతపై పోరాటం
బ్రిటిష్ వలస పాలన, నిజాం ప్రభుత్వ అబ్కారీ విధానాలు గౌడుల సంప్రదాయ వృత్తి హక్కులను, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఎలా దెబ్బతీశాయో ఈ పరిశోధనా పత్రంలో ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల ఆధిపత్యం వల్ల స్వతంత్ర వృత్తిదారులుగా ఉన్న గౌడులు ఆర్థిక దోపిడీకి గురయ్యారని, ఈ వివక్షను ఎదుర్కొంటూ గౌడ సంఘాలు ఏర్పడి వృత్తి హక్కులు, ఆత్మగౌరవం కోసం ఎలా పోరాటాలు ప్రారంభించాయో సదస్సులో ప్రస్తావించారు. 1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గౌడ యువత కీలకంగా పాల్గొని నిజాం నిరంకుశత్వం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలా పోరాడారో గుర్తుచేశారు.

స్వాతంత్ర్యం తర్వాత హక్కుల సాధన
స్వాతంత్ర్యం తర్వాత సహకార సంఘాల ఏర్పాటు, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా తమ హక్కుల సాధనకు గౌడులు చేసిన కృషిని ఈ పత్రం ద్వారా డాక్టర్ ముత్యం గౌడ్ వివరించారు. దళిత, బహుజన, ఇతర ఉత్పత్తి కులాలతో ఐక్యతను పెంపొందిస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రజాస్వామిక విలువలకు వారు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. మొత్తంగా గౌడుల చరిత్ర అనేది అణచివేత నుంచి ఆత్మగౌరవం వైపు, సామాజిక వివక్ష నుంచి సమానత్వం వైపు సాగిన పోరాట గాథ అని ఆయన స్పష్టం చేశారు.
ఐదు రాష్ట్రాల నుంచి ప్రతినిధుల రాక
ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాస్ అధ్యక్షతన ఈ పరిశోధనా పత్ర సమర్పణ సెషన్ విజయవంతంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



