చిన్న సినిమాల మనుగడకు ప్రమాదం.. సౌత్ ఇండియా సినిమాను ప్రశంసించారు

హైదరాబాద్, సూర్య న్యూస్ :
సాహిత్యమే మనిషిని సజీవంగా నిలుపుతుందనే సందేశంతో రెండు రోజుల ఛాయా సాహిత్యోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది ఓ పెద్ద స్కాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో (BR Ambedkar Open University) శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవంలో ప్రముఖ బాలీవుడ్ (Bollywood) దర్శకుడు అనురాగ్ కశ్యప్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది ఓ పెద్ద స్కాం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిన్న సినిమాల మనుగడకు ప్రమాదం..
భారీ బడ్జెట్ చిత్రాలు సినిమా స్ఫూర్తిని దెబ్బతీస్తాయని, అవి చిన్న సినిమాల మనుగడకు ప్రమాదకరమని అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి సినిమాలు వస్తున్నాయని ఆయన ప్రశంసించారు. సాహిత్యం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి, ఇతర భారతీయ అంతర్జాతీయ సాహిత్యానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో భాగంగానే ఈ ఛాయా సాహిత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు.

సమాజాన్ని కుదిపే సాహిత్యం అవసరం..
ఈ ఉత్సవంలో “సమాజాన్ని కుదిపే సాహిత్యం ఎందుకు అవసరం” అనే అంశంపై ప్రముఖ సినీ నటి రోహిణి, తమిళ కవయిత్రి సల్మ, మృణాళిని, కశ్మీరి కవయిత్రి నిఘత్ సాహెబా మాట్లాడారు. “కవిత్వం ప్రపంచీకరణ-పరాయీకరణ” అనే అంశంపై అమెరికన్ రచయిత పీటర్ కాన్స్టాంటైన్, కవి యాకూబ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. “మూసీ తీరపు జ్ఞాపకాలు: రచనల్లో హైదరాబాద్ చారిత్రక వారసత్వం” పై జరిగిన చర్చలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన, ఫ్లీ బజార్..
తొలిరోజు కార్యక్రమంలో భాగంగా అమరానందమే ప్రేమ, ఏడు గజాల కోక, ఊరు భంగం తదితర పుస్తకాలను ఆవిష్కరించారు. 50కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన, ఫ్లీ బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినీ నేపథ్యగాయకులు సాయి చరణ్, హరిణిల సంగీత ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తమిళ రచయిత జయమోహన్, కన్నడ రచయిత వివేశ్ శాన్బాగ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వివిధ భాషలకు చెందిన రచయితల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఉత్సవం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.




ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



