న్యూఢిల్లీ, సూర్య న్యూస్: వ్యక్తిగత గోప్యత హక్కు అనేది సంపూర్ణమైనది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాన్ని (Extramarital Affair) నిరూపించే క్రమంలో భార్య లేదా భర్తకు భాగస్వామి యొక్క మొబైల్ కాల్ డేటా లేదా హోటల్ బస వివరాలను నిరాకరించడానికి దీనిని ఒక డాలుగా వాడుకోలేరని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. కోర్టులో ఇటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

ఈ వివాదంలో 1998లో వివాహం చేసుకున్న ఒక దంపతులకు 2000 సంవత్సరంలో కుమార్తె జన్మించింది. అయితే తన భర్త జైపూర్‌లోని ఒక హోటల్‌లో మరో మహిళతో కలిసి ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య కనుగొంది. దీనిపై ఆమె విడాకుల (Divorce) కేసు వేసింది. ఆ సంబంధాన్ని నిరూపించడానికి భర్త ఫోన్ కాల్ రికార్డులు మరియు హోటల్ బుకింగ్ వివరాలు కావాలని ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా దీనికి అనుమతించగా భర్త సుప్రీంకోర్టుకు వెళ్లాడు. చివరకు భార్య తరపు న్యాయవాది ప్రభ్ జీత్ జౌహర్ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు భర్త అప్పీల్‌ను కొట్టివేస్తూ కాల్ డేటాను సమర్పించాల్సిందేనని ఆదేశించింది.
పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న సందర్భాలలో వ్యక్తిగత గోప్యత హక్కుకు (Right to Privacy) కొన్ని సహేతుకమైన పరిమితులు ఉంటాయని న్యాయస్థానం పేర్కొంది. పెళ్లి బంధం వెలుపల పరస్పర అంగీకారంతో సాగించే లైంగిక సంబంధాలకు ఆర్టికల్ 21 కింద రక్షణ లభించదని గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. హిందూ వివాహ చట్టం (Hindu Marriage Act) ప్రకారం వివాహేతర సంబంధం అనేది విడాకులకు బలమైన కారణం అవుతుంది. కాబట్టి భార్యకు ద్రోహం చేసిన భర్తను రక్షించడానికి గోప్యత హక్కును ఉపయోగించడం ఎంతమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. భర్త తప్పు చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని చెప్పజాలరని మరియు ఆధారాల సేకరణలో కోర్టులు సహాయం చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత గోప్యతకు కొన్ని పరిమితులు ఉంటాయి. రైట్ టు ప్రైవసీ పేరుతో ఫోన్ కాల్స్ మరియు చాట్స్‌ను కోర్టుకు ఇవ్వకుండా దాచలేరు. అయితే ఒక మహిళ రాత్రి వేళల్లో మరో పురుషుడితో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన ఆమె శీలాన్ని శంకించలేమని ఢిల్లీ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. సరైన ప్రాతిపదిక లేకుండా ఆమె కాల్ డేటా రికార్డులను కోరడం ద్వారా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛా హక్కులో జోక్యం చేసుకోవడాన్ని సమర్థించలేమని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధంలో ఉంటే చట్టపరంగా శిక్ష ఉండదు. కానీ అదే సంబంధాన్ని కారణంగా చూపిస్తూ భాగస్వామి నుండి చట్టబద్ధంగా విడాకులు కోరవచ్చు.




