ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం
2047 నాటికి ‘వికసిత్ భారత్’ మన లక్ష్యం
దేశంలో త్వరలో సెమీకండక్టర్ ప్లాంట్లు, 5 కొత్త న్యూక్లియర్ ప్లాంట్లు
గడిచిన కొన్నేళ్లలో 25 కోట్ల మందికి విముక్తి కల్పించాం

న్యూఢిల్లీ (సూర్య న్యూస్ డెస్క్):నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, త్వరలోనే మన దేశం అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమరయోధులను ఆయన స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామని, ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని ప్రధాని తెలిపారు. దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, దేశ ప్రజలంతా పెద్ద కలలు కనాలని ఆయన పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ లక్ష్యం – పేదరిక నిర్మూలన
దృఢ సంకల్పంతో ముందుకెళ్లి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్)గా నిలవాలన్నదే మన లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’గా ఎదగాలని ఆకాంక్షించారు.
సాంకేతికత, ఇంధన రంగాల్లో ముందడుగు
దేశంలో త్వరలోనే సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయని ప్రధాని తెలిపారు. డిజిటల్, క్రిటికల్ మినరల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే అనేక దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. భారత్ న్యూక్లియర్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోందని, త్వరలోనే 5 కొత్త న్యూక్లియర్ ప్లాంట్లు రాబోతున్నాయని ప్రకటించారు. భవిష్యత్తులో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ‘సముద్ర మంథన్’ ద్వారా కొత్త ఆవిష్కరణలు చేపట్టామని, 1.75 కోట్ల ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్, 50 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, హైడ్రోజన్ రైళ్లు కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని ఆయన వివరించారు.
అడ్డంకులు అధిగమించి.. స్వయం సమృద్ధితో..
భారత ప్రజలను భయపెట్టి ఆనందించాలని కొందరు చూశారని మోదీ విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత వస్తుందంటూ అసత్యాలు ప్రచారం చేసినప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నామని స్పష్టం చేశారు. భారత్ తన అంతర్గత సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుని నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



