
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో అత్యధిక కాలం నిరంతరంగా ప్రధానిగా పనిచేసిన నాయకురాలిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీ (Giorgia Meloni) కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఆయన స్పందిస్తూ మెలోనీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
రికార్డు బ్రేక్ చేసిన మెలోనీ
జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 4 నాటికి ఆమె ప్రభుత్వం 1,413 రోజులు పూర్తి చేసుకుని, యుద్ధానంతర ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరంగా కొనసాగిన ప్రభుత్వంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో సిల్వియో బెర్లుస్కోని నేతృత్వంలోని రెండో ప్రభుత్వం 1,412 రోజుల పాటు కొనసాగి నెలకొల్పిన రికార్డును మెలోనీ తాజాగా అధిగమించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఇప్పటివరకు 68 ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో, మెలోనీ సాధించిన ఈ రాజకీయ స్థిరత్వం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
నా స్నేహితురాలు అంటూ మోదీ ప్రశంసలు
ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న మెలోనీని ‘నా స్నేహితురాలు’గా సంబోధిస్తూ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటలీ ప్రజలు ఆమె నాయకత్వంపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ రికార్డే నిదర్శనమని ఆయన కొనియాడారు. భారత్, ఇటలీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలక పాత్ర పోషించిందని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన ఆయన, భవిష్యత్తులో మెలోనీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



