
తాడేపల్లి, సూర్యా న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మరోసారి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు (Padayatra) సిద్ధమవుతున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో పాదయాత్ర 2.0 కార్యాచరణపై స్వయంగా ప్రకటన చేశారు. వచ్చే ఏడాది అంటే 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఈ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.
గ్రాస్ రూట్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం
గత ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను తిరిగి క్రియాశీలం చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు పాదయాత్రను ప్రధాన వేదికగా ఎంచుకున్నారు. గతంలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర తరహాలోనే ఈ రెండో విడత పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని పార్టీ భావిస్తోంది.

కూటమి వైఫల్యాలే ప్రధాన అజెండా
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరు, పాలనాపరమైన అంశాలను ప్రజల్లో ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్ర సాగనుంది. అదే సమయంలో గత తమ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని యోచిస్తున్నారు. ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్, ద్వితీయ శ్రేణి నాయకుల్లో నూతనోత్సాహం నింపేలా యాత్ర కార్యాచరణను రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పూర్తి రూట్ మ్యాప్ రూపకల్పనపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



