
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ప్రస్తుత విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో (TDP) చేరారు. మంగళవారం ఆయన తన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవులకు విరమణ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపిన కొద్ది గంటల్లోనే ఆయన తన అనుచరులతో కలిసి అమరావతికి పయనమయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో చిన్న శ్రీను పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు స్వయంగా వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేందుకే పార్టీ మారానని చిన్న శ్రీను ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మేయర్ రేసులో చిన్న శ్రీను కుమార్తె?
విజయనగరం జిల్లా రాజకీయాల్లో బలమైన పట్టున్న చిన్న శ్రీను ఆకస్మికంగా పార్టీ మారడం వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా ఆయన కుమార్తె సిరి సహస్ర పేరు ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా వినిపిస్తోంది. జిల్లాలో చాలా కాలంగా చక్రం తిప్పిన చిన్న శ్రీను ఇలా అనూహ్యంగా పార్టీ మారడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



