
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా (Nestle India) ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) దాఖలు చేసిన మూడు కేసుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నారుల ఆహార ఉత్పత్తుల ప్రచార నిబంధనల ఉల్లంఘన, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సెప్టెంబర్ 18న ఈ అడ్జుడికేషన్ కేసులను నమోదు చేసింది. అయితే, తమ ఉత్పత్తుల్లో ఎలాంటి లోపం లేదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని నెస్లే ఇండియా యాజమాన్యం స్పష్టం చేసింది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నమోదు చేసిన మూడు కేసులు ఇవే..
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రధానంగా మూడు వేర్వేరు అంశాలపై నెస్లేపై కేసులు దాఖలు చేసింది. ఇందులో మొదటి రెండు కేసులు నాణ్యతా లోపానికి సంబంధించినవి కావు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల ఉత్పత్తులను ప్రమోట్ చేసిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ కేసులు నమోదయ్యాయి. ‘NAN Excella Pro Stage 1’ ప్రమోషన్‌లో “5 HMOs”, “Whey Protein” ఉన్నాయని, అలాగే ‘Lactogen Pro 1’ ప్రమోషన్‌లో “వే ప్రొటీన్ సులభంగా జీర్ణమవుతుంది” అని కంపెనీ చేసిన క్లెయిమ్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. శిశు ఆహార ప్రకటనలను నియంత్రించే ‘ఐఎంఎస్ చట్టం 1992’ (IMS Act 1992), 2020 నిబంధనల ప్రకారం ఇవి ఉల్లంఘనల కిందకు వస్తాయని పేర్కొంది.
బయోటిన్ లోపంపై మూడో కేసు
ఇక మూడో కేసు నేరుగా ఉత్పత్తి నాణ్యతకు సంబంధించినది కావడం గమనార్హం. నెస్లేకు చెందిన ఒక ‘ఫాలో-అప్ ఫార్ములా’ నమూనాను ల్యాబ్‌లో పరీక్షించగా.. అందులో బయోటిన్ (విటమిన్ బి7) స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెఫరల్ ల్యాబ్ కూడా ఈ విషయాన్నే ధృవీకరించడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అడ్జుడికేషన్ కేసు నమోదు చేసింది.
నెస్లే వాదన ఏంటి?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలపై నెస్లే ఇండియా తనదైన శైలిలో వివరణ ఇచ్చుకుంది. తాము లేబుల్స్‌పై చేసిన ప్రకటనలన్నీ వాస్తవమేనని, వాటికి పూర్తి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. NAN Excella Pro, Lactogen Pro లేబుళ్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి ముందే ఆమోదం లభించిందని గుర్తుచేసింది. ఉత్పత్తుల నాణ్యత, ప్రభుత్వ నిబంధనల అమలులో తాము ఎక్కడా రాజీ పడలేదని వివరించింది. అయితే బయోటిన్ లోపంపై సంస్థ ప్రత్యేకంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరోవైపు, వినియోగదారులకు అవగాహన కల్పించే దిశగా భవిష్యత్తులో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతో కలిసి పనిచేస్తామని నెస్లే వెల్లడించింది.
ప్రస్తుతం ఈ మూడు కేసుల విచారణ కొనసాగుతుండగా, నెస్లేపై అధికారికంగా ఎలాంటి పెనాల్టీలు ఖరారు కాలేదు. తుది తీర్పు వచ్చిన తర్వాతే ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



