|  
● FLASH NEWS
Elections: 13కి 12 కార్పొరేషన్లు కూటమి కైవసం.. ఏ నగరంలో ఎవరు మేయర్ అంటే?  •  PawanKalyan: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు  •  Raptadu: రాప్తాడు ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు.. కఠిన సెక్షన్లతో కేసు  •  Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  • 
Skip to content

Elections: 13కి 12 కార్పొరేషన్లు కూటమి కైవసం.. ఏ నగరంలో ఎవరు మేయర్ అంటే?

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Municipal Election Results) ఎన్డీఏ కూటమి (Kutami) చారిత్రక విజయం సాధించింది. నవంబర్ 1వ తేదీన జరిగిన 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు 138 కేంద్రాల్లో ప్రారంభం కాగా, తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 96,89,061 మంది ఓటర్లకు గాను 60,22,411 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 62.16 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పక్షాలు క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోయాయి.

కార్పొరేషన్లలో ఏకపక్ష విజయం

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అనంతపురం కార్పొరేషన్‌లో మాత్రమే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్ విజయం సాధించారు. ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి స్థానం కేటాయించగా ఆ పార్టీ పరాజయం పాలైంది. ప్రధాన కార్పొరేషన్ల మేయర్లుగా విశాఖపట్నంలో ముక్కా శ్రావణి (టీడీపీ), విజయనగరంలో అవనాపు భార్గవి (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన), మచిలీపట్నంలో షేక్ అబ్దుల్లా అబిదా (టీడీపీ), విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ (జనసేన) విజయం సాధించారు. అలాగే గుంటూరులో కె. లక్ష్మీ అపర్ణ, ఒంగోలులో నల్లిమిల్లి శ్రీ శిల్ప, కర్నూలులో విజయ ప్రత్యూష, నెల్లూరులో ఆనం రూప్ కుమార్ యాదవ్, కడపలో మట్టి సువర్ణ, తిరుపతిలో ఎం. శ్రీనివాస్ ప్రసాద్, చిత్తూరులో కె. హేమలత టీడీపీ తరఫున మేయర్లుగా గెలుపొందారు.

మున్సిపాలిటీల్లోనూ 90 శాతం స్థానాలు

మరోవైపు 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో సుమారు 90 శాతం స్థానాలను కూటమి పార్టీలే సొంతం చేసుకున్నాయి. వీటిలో టీడీపీ 59, జనసేన 18, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందగా.. వైసీపీ 3, ఇతరులు 2 స్థానాలకే పరిమితమయ్యారు. ఇప్పటికే 17 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ పదవులు, 8 చోట్ల వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మొత్తం 32 వార్డులను టీడీపీ గెలుచుకుని సంపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. అలాగే వైఎస్సార్సీపీకి కంచుకోటగా భావించే పులివెందులలోనూ టీడీపీ ఘనవిజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది.

ప్రజలకిచ్చిన బాధ్యత ఇది: కూటమి నేతలు

ఈ చారిత్రక తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఇది అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా అభివర్ణించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు కూటమికే సంపూర్ణ మద్దతు తెలిపారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు సంబరాలకు కాదని, అహంకారానికి తావులేకుండా ప్రతి పౌరుడికి సేవ చేసేందుకు ఇచ్చిన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

పులివెందులలో రీపోలింగ్ జరగాలి: జగన్

ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నిక కాదని, అధికార బలంతో చేసిన ఎంపిక అని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పులివెందులలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదని, అక్కడ తక్షణం రీపోలింగ్ నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp