
హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల (Journalists Housing) సమస్యపై ఎలాంటి చర్చా జరక్కపోవడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా, జర్నలిస్టులకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కనీస చిత్తశుద్ధి చూపడం లేదని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.
అమలుకు నోచుకోని ఐదు హామీలు
ఎన్నికల మేనిఫెస్టోలోని 27వ అంశంగా అధికార పార్టీ జర్నలిస్టులకు ఐదు ప్రధాన హామీలు ఇచ్చిందని సోమయ్య గుర్తుచేశారు. రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు, హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వంటి హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగిన 25కు పైగా కేబినెట్ సమావేశాల్లో ఏ ఒక్కరోజూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కనీస చర్చ జరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
చిన్న పత్రికలకు అన్యాయం
కొత్త హామీలు అమలు చేయకపోగా, గతంలో ఉన్న సౌకర్యాలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోందని సోమయ్య ఆరోపించారు. చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడంతో పాటు, రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 వేల అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, కేబుల్ ఛానళ్లకు ఇచ్చే కోటాను సగానికి తగ్గించారని, ఐపీ నెట్‌వర్క్ ఛానళ్లకు కార్డులు నిరాకరిస్తూ అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉద్యోగుల్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి
ప్రస్తుతం జర్నలిస్టులకు ఇస్తున్న పాత హెల్త్ కార్డులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరిగా పనిచేయడం లేదని, దీంతో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలోనే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు సైతం నగదు రహిత మెరుగైన వైద్యం అందేలా కొత్త హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



