
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ (Breakfast Scheme) సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడంతో, బడుల్లో పిల్లల నమోదుతో పాటు రోజువారీ హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగినట్లు తాజా సర్వేలో వెల్లడైంది.
థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వే (Third Vision Research) నివేదిక ప్రకారం, ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు 13 శాతం మేర పెరిగింది. అలాగే, విద్యార్థుల దినసరి హాజరు శాతం ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు పెరిగినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు, వారిని విద్య వైపు ప్రోత్సహించడంలో ఈ పథకం విజయవంతమైందని నివేదిక పేర్కొంది.
పేద కుటుంబాలకు పెద్ద ఊరట
అల్పాహార పథకం సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఆర్థిక నేపథ్యమేనని విద్యా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉండగా, ఇప్పుడు ఉదయం పూట టిఫిన్ కూడా పెడుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. రోజుకు రెండు పూటలా పిల్లలకు కడుపునిండా పౌష్టికాహారం స్కూల్లోనే దొరుకుతుండటంతో, రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం పనులకు వెళ్లే తల్లిదండ్రులకు పిల్లల అల్పాహారం చింత తప్పడం కూడా హాజరు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా తెలుస్తోంది.
ప్రజాధనం వృథా అవుతుందా?
ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందనే వాదనలు ఉన్నప్పటికీ, సామాజిక కోణంలో చూస్తే ఇది అత్యుత్తమ పెట్టుబడి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉచిత పథకాల పేరుతో ప్రజాధనం వృథా అవుతుందన్న విమర్శలను విద్యావేత్తలు తోసిపుచ్చుతున్నారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, అక్షరాస్యత కోసం వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తులో నైపుణ్యమున్న మానవ వనరుల సృష్టికి దోహదపడుతుందని చెబుతున్నారు. పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు, మధ్యలో బడి మానేసే (డ్రాపౌట్) శాతాన్ని తగ్గించడంలో ఈ పథకం దీర్ఘకాలికంగా సమాజానికి మేలు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



