
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక బ్రిక్స్ 2026 శిఖరాగ్ర సదస్సులో (BRICS 2026 Summit) సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయంతో ‘ఢిల్లీ డిక్లరేషన్’ను (Delhi Declaration) ఆమోదించాయి. భౌగోళిక రాజకీయ విభేదాలు, యుద్ధ పరిస్థితులు, వాణిజ్య ఆంక్షల నడుమ భిన్న ప్రయోజనాలున్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సక్సెస్ సాధించడం ద్వారా భారతదేశం తన దౌత్య నైపుణ్యాన్ని ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటిచెప్పింది.
విభేదాల మధ్య ఏకాభిప్రాయం
నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్, ఈ సదస్సును కేవలం ఒక సమావేశంగా కాకుండా ప్రపంచ శక్తుల మధ్య ఏకాభిప్రాయాన్ని నిర్మించే దౌత్య వేదికగా మలచడంలో సఫలమైంది. ప్రస్తుతం ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇరాన్, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం, ఆర్థిక వ్యవస్థలో 40 శాతం వాటా ఉన్న ఈ పదకొండు దేశాల మధ్య భద్రతాపరమైన, ప్రాంతీయ రాజకీయ విభేదాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విభిన్న అభిప్రాయాలున్న దేశాలను ఒకే గొంతుకతో మాట్లాడేలా చేయడం భారత్‌కు ఎదురైన పెద్ద పరీక్ష. అయితే ఆ సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ఢిల్లీ డిక్లరేషన్‌ను ఒక ఉమ్మడి ప్రకటనగా తీసుకురావడంలో భారత్ విజయం సాధించింది.

గ్లోబల్ సౌత్ గొంతుకగా భారత్
బ్రిక్స్‌ను పాశ్చాత్య దేశాలకు వ్యతిరేక కూటమిగా కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచే వేదికగా చూడటమే భారత దౌత్య విధానంలోని ప్రధాన వ్యూహం. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల్లో సంస్కరణలు అవసరమన్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో బలంగా ముందుంచారు. దీనిని కేవలం భారతదేశ డిమాండ్‌గా కాకుండా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల సమిష్టి ఆకాంక్షగా మలచడంలో భారత దౌత్యం సఫలమైంది. డిక్లరేషన్ భాషలో కూడా ఏ దేశాన్నీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోకుండా.. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వానికి పెద్దపీట వేస్తూ ఉమ్మడి అవగాహనను నిర్మించారు.

వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి
ఈ సదస్సులో రాజకీయాలతో పాటు స్థానిక కరెన్సీల వినియోగం, పరస్పర వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి అంశాలపైనా కీలక చర్చలు జరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌కు ప్రత్యామ్నాయం దిశగా స్థానిక కరెన్సీల్లో క్రెడిట్ సదుపాయాలకు సంబంధించిన యంత్రాంగాలపై దృష్టి సారించారు. మరోవైపు, అమెరికా, ఐరోపా దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తూనే.. రష్యా, చైనా, పశ్చిమాసియా దేశాలతో ఏకకాలంలో సంబంధాలు నెరపడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మరింత బలోపేతం చేసుకుంది. ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా విడదీయడం కంటే, బహుళ ధృవ ప్రపంచంలో విభిన్న పక్షాలు మాట్లాడుకునే సంభాషణల వేదికగా, ఏకాభిప్రాయానికి కేంద్రంగా భారత్ అవతరించిందని ఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేసింది.



ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



