
హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్ర కేబినెట్ నుంచి అనూహ్యంగా ఉద్వాసనకు గురైన సీనియర్ నాయకురాలు కొండా సురేఖ (Konda Surekha) మళ్లీ ఢిల్లీ బాట పట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం (Congress High Command) నుంచి ఆమెకు అత్యవసర పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆమెకు ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించబోతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తమ ముఖ్య అనుచరులతో హన్మకొండలో అత్యవసరంగా భేటీ కానున్నారు. తమకు ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన పిలుపు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో అనుచరుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇప్పటికే తమకు ఓ కీలక పదవి ఖాయమైందని కొండా మురళి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో ఈ భేటీ పూర్తయిన వెంటనే సురేఖ ఢిల్లీకి బయలుదేరనున్నారు.
హైకమాండ్ వ్యూహంపై ఉత్కంఠ
మంత్రి పదవి నుంచి ఆమెను తొలగించినప్పటికీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఉన్న బలమైన క్యాడర్, వారి ప్రాబల్యాన్ని పరిగణనలోకి తీసుకునే ఏఐసీసీ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సురేఖను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



