
ఎన్టీఆర్ జిల్లా, సూర్య న్యూస్ : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాలు బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు బదలాయించాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల్లో ఒకే కూటమి అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే ‘ట్రిపుల్ ఇంజిన్’ నినాదం ఆచరణలోకి రావాలంటే మున్సిపాలిటీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల జోక్యం తగ్గించి, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్ణయాధికారం ఇవ్వాలని కోరింది.
విజయవాడలోని సీపీఎం నగర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్. బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఈ డిమాండ్లు చేశారు. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడం, వాటికి రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ సిఫారసుల మేరకు స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.2,62,975 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వచ్చే ఐదేళ్లలో రూ.28,785 కోట్లను క్రమం తప్పకుండా జమ చేయాలని కోరారు. 15వ, 16వ ఆర్థిక సంఘాల సిఫారసులకు అనుగుణంగా నిధుల విడుదలలో జాప్యం చేయకూడదన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ నగరపాలక సంస్థకు రావాల్సిన రూ.1,000 కోట్లను, విశాఖపట్నానికి సంబంధించిన చట్టబద్ధమైన గ్రాంట్ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. నిధుల కొరత కారణంగా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ పనులు ప్రభావితమవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
73, 74వ రాజ్యాంగ సవరణల అమలుకు డిమాండ్
స్థానిక స్వపరిపాలన వ్యవస్థలను బలోపేతం చేయడానికి 73వ, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తిని అమలు చేయాలని సీపీఎం నేతలు సూచించారు. స్థానిక సంస్థలకు బదలాయించాల్సిన 18 రకాల విధులను పూర్తిస్థాయిలో అప్పగించాలని కోరారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ప్రజల ద్వారా ఎన్నికైనప్పటికీ, కీలక నిర్ణయాల విషయంలో ప్రభుత్వ పెద్దల జోక్యం ఉంటోందని విమర్శించారు.
మేయర్ ఇన్ కౌన్సిల్ విధానంతో సహా ఎన్నికైన మేయర్లు, చైర్మన్లకు తగిన అధికారాలు కల్పించేలా చట్టాల్లో మార్పులు చేయాలని సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు.
ఆస్తి పన్ను, చెత్త పన్ను జీవోలను రద్దు చేయాలి
ఏటా ఆస్తి పన్ను పెంచేందుకు వీలు కల్పించే 198వ నంబరు జీవోను, మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణతో పాటు చెత్త పన్ను వంటి యూజర్ ఛార్జీల విధింపునకు దారితీస్తుందని పేర్కొన్న 673వ నంబరు జీవోను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఇప్పటికే పట్టణ ప్రజలపై పన్నుల భారం ఉందని, అదనపు ఛార్జీలు విధించడం వల్ల సామాన్య కుటుంబాలపై మరింత ఆర్థిక ఒత్తిడి పడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.
మంచినీటి సరఫరా, డ్రైనేజీ, ట్రాఫిక్, పారిశుధ్యం, దోమల బెడద, వర్షాకాలంలో వరద ముంపు వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు. మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి సేవలను మెరుగుపరచాలని సూచించారు.
ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం కంటే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం నేతలు సూచించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ కౌన్సిల్లో మూడోసారి విజయం సాధించిన బోయి సత్యబాబుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన తమ పార్టీ ప్రతినిధులు ప్రజల తరఫున నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని తెలిపారు.
విజయవాడ కౌన్సిల్ ప్రతిష్టను కాపాడాలి
విజయవాడ 52వ డివిజన్ నుంచి ఎన్నికైన సీపీఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ, గతంలో పలువురు నాయకులు నిలబెట్టిన నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రతిష్టను కొత్త పాలకవర్గం కాపాడాలని కోరారు. ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్న మేయర్ వంగవీటి రాధాకృష్ణతో పాటు 86 మంది కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
గత ఐదేళ్ల పాలనలో నగర ప్రజలు పన్నుల భారం, కలుషిత తాగునీరు, అవినీతి వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడకు రావాల్సిన సుమారు రూ.1,000 కోట్ల పెండింగ్ బకాయిలను రాబట్టేందుకు కొత్త పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. 14వ, 15వ ఆర్థిక సంఘాల నిధులు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిలను సాధించాలని కోరారు.
నగర అభివృద్ధి పనులకు సీపీఎం పూర్తి మద్దతు ఉంటుందని, తనను మూడోసారి కార్పొరేటర్‌గా ఎన్నుకున్న 52వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం విజయవాడ నగర కార్యదర్శి భూపతి రమణారావు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



