
తోట్లవల్లూరు, సూర్య న్యూస్ : కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో (Thotlavalluru) వివాహిత లక్ష్మీప్రియాంక (27) ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త నుంచి కోర్టు నోటీసులు రావడం, కుటుంబ కలహాల (Family Disputes) నేపథ్యంలో ఆమె తన పుట్టింట్లో ప్రాణాలు తీసుకుంది.
తోట్లవల్లూరు పీహెచ్‌సీ సమీపంలో నివసించే పోతుగంటి సత్యన్నారాయణ, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీప్రియాంక. ఆమెకు గొల్లపూడికి చెందిన వేల్పూరి అశోక్ కుమార్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే కొద్ది కాలానికే దంపతుల మధ్య గొడవలు రావడంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో గత శనివారం భర్త అశోక్ కుమార్ ఆమెకు కోర్టు నోటీసులు పంపాడు. అదే రోజు లక్ష్మీప్రియాంక గొల్లపూడిలోని తన భర్త ఇంటికి వెళ్లి తిరిగి వచ్చింది. సోమవారం ఆమె తల్లిదండ్రులు వైద్యం నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
తన మరణానికి భర్త, అత్త, చిన్నత్త, ఆడపడుచులే కారణమని పేర్కొంటూ ఆమె రాసిన ఒక నోట్‌ను పోలీసులు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరోపణల కోణంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



