
భూపాలపల్లి, సూర్య న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ కార్యాలయ ఆవరణలోనే సుమారు పది టేకు చెట్లను నరికివేసి కలపను తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లై స్క్వాడ్ కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అటవీ సంపద పరిరక్షణ బాధ్యత కలిగిన కార్యాలయ ప్రాంగణంలోనే చెట్లు నేలకొరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆవరణలోనే చెట్ల నరికివేత ఆరోపణలు
భూపాలపల్లి అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణంలో నిలిపి ఉంచిన మూడు ట్రాక్టర్ల మధ్యలోనే టేకు చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ప్రాంగణంలోని చింతచెట్టు పక్కన ఉన్న టేకు చెట్లను కూడా నరికివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నరికివేసిన కలప దుంగలు అక్కడక్కడా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సిబ్బంది పాత్రపై అనుమానాలు
అటవీ శాఖ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించి టేకు చెట్లను నరకడం, కలపను బయటకు తరలించడం సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే పని కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్యాలయ పరిసరాల్లోనే ఘటన జరగడంతో శాఖలోని కొందరి పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కలపను బయట విక్రయించారనే ఆరోపణలపై అధికారిక విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
అధికారుల స్పందన, విచారణ అవసరం
ఫ్లై స్క్వాడ్ కార్యాలయం సమీపంలోనే చెట్ల నరికివేత జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయ ఆవరణలో ఎన్ని టేకు చెట్లు ఉన్నాయి, ఎన్ని నరికివేతకు గురయ్యాయి, కలప ఎక్కడికి తరలించారు వంటి అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



