రిపోర్టర్: బొమ్మరబోయిన రమేష్

నల్గొండ, సూర్య న్యూస్ : నల్గొండ జిల్లా (Nalgonda District) చండూరు మండలం కస్తాల గ్రామపంచాయతీలో భారీస్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ మెజార్టీ వార్డు సభ్యులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనుల పేరిట రికార్డులు సృష్టించడంతో పాటు, పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్‌ను (Water Tanker) సైతం అక్రమంగా విక్రయించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ నిధులను రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అభివృద్ధి పనుల పేరిట అక్రమాలు
గ్రామపంచాయతీలో 2025 డిసెంబర్ 22 నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఎనిమిది మంది వార్డు సభ్యులు తమ ఫిర్యాదులో వెల్లడించారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, బిల్లులు, వోచర్లు, తీర్మానాలు తదితర రికార్డుల నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారిమళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, వార్డు సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో పారదర్శకంగా రికార్డుల పరిశీలన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
తీర్మానం లేకుండానే వాటర్ ట్యాంకర్ విక్రయం
ఇదే క్రమంలో కస్తాల గ్రామస్తుడు బొమ్మరబోయిన రమేష్ కలెక్టర్‌కు మరో ఫిర్యాదు అందజేశారు. గ్రామ ప్రజల అవసరాల కోసం 2020 సంవత్సరంలో పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్‌ను ఎలాంటి తీర్మానం లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా అక్రమంగా విక్రయించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఆ ట్యాంకర్‌ను స్క్రాప్‌కు వేసినట్లు చెబుతున్నారని, ఎవరి అనుమతితో, ఎంత మొత్తానికి విక్రయించారో విచారణ జరిపించాలని కోరారు. అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును పంచాయతీ ఖాతాలో జమ చేశారా లేదా అనే దానిపై ఆధారాలు పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు.
విచారణకు ఆదేశించిన కలెక్టరేట్
వార్డు సభ్యులు, గ్రామస్తుల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారి (DPO)ని ఆదేశిస్తూ ఫిర్యాదు పత్రాలపై ఎండార్స్మెంట్ చేశారు. విచారణలో నిధుల దుర్వినియోగం రుజువైతే బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



