
ముంబై, సూర్య న్యూస్ : మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) నిర్వహించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక అరెస్ట్ చేశారు. తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏడో ర్యాంకు సాధించిన రుతుజా పాటిల్‌ను నందుర్బార్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది.
పరీక్షకు ముందే రుతుజా పాటిల్‌కు లీకైన ప్రశ్నపత్రం చేరిందని, అయితే ఆమెకు మొదటి ర్యాంక్ వస్తే అధికారులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే 10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాయాలని నిందితులు ఆమెకు సలహా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
రద్దయిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ
గతేడాది మార్చి 22న మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు డివిజనల్ కేంద్రాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరిగింది. జూన్ 12న వెలువడిన ఫలితాల్లో 506 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక కాగా, జూలైలో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. అయితే, జూలై 22 నుంచి 26 మధ్య ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రాథమిక విచారణలో లీకైన ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్లు తేలడంతో, అప్రమత్తమైన MPSC మొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
అధికారుల పాత్ర
ఈ కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు MPSC అధికారులతో సహా మొత్తం ఆరుగురిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో MPSC అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాతే, గోపాల్ భట్టు మరాఠే, అండర్ సెక్రటరీ అభిజీత్ గణపత్రావ్ లెండ్వే, కౌటిల్య అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ దిలీప్ పాటిల్, అమృత్ నామ్‌దేవ్ పాటిల్, లోకేష్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్ ఉన్నారు. నిందితులంతా కలిసి పరీక్షకు ముందే ప్రశ్నలను సేకరించి, వాటిని అనధికార వ్యక్తులకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



