
హైదరాబాద్, సూర్య న్యూస్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తదుపరి సినిమా గురించి ఫిలిం నగర్ లో ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘ఆదిపురుష్’ లాంటి అతిపెద్ద డిజాస్టర్ తీసిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తో రామ్ చరణ్ ఒక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అసలు ఈ కాంబినేషన్ నిజమేనా, లేక కేవలం గాలివార్తా అన్నది పక్కన పెడితే.. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా జరుగుతున్న ఈ ప్రచారంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బొమ్మల సినిమా తీసిన దర్శకుడికి బంపర్ ఆఫరా?
కొత్తగా వస్తున్న యువ దర్శకులు సైతం వంద శాతం పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ తో అద్భుతమైన విజువల్స్ సృష్టిస్తున్న ఈ రోజుల్లో, అత్యంత భారీ బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ తీసి దానిని ఒక కార్టూన్ బొమ్మల సినిమా స్థాయికి దిగజార్చిన ఘనత ఓం రౌత్ సొంతం. ఆ సినిమాతో ఆయన మూటగట్టుకున్న నెగిటివిటీ అంతా ఇంతా కాదు. అలాంటి అపఖ్యాతి ఉన్న దర్శకుడు చెప్పిన కథకు రామ్ చరణ్ నిజంగానే ఎగ్జైట్ అయ్యాడా? లేక తనకున్న అతి మంచితనంతో, ఎవరైనా వచ్చి కథ చెప్తే కాదనలేక మొహమాటానికి పోయి ఈ నిర్ణయం తీసుకున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొహమాటం పక్కన పెడితేనే భవిష్యత్తు
ప్రస్తుతం రామ్ చరణ్ మార్కెట్ గ్లోబల్ స్థాయిలో ఉంది. తన ఇమేజ్ కు తగ్గ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇలాంటి కీలక సమయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత భారీ విజువల్ వండర్, పీరియాడికల్ స్టోరీ అని చెప్పినా.. గతంలో అలాంటి ప్రయత్నమే చేసి చేతులు కాల్చుకున్న దర్శకుడి చేతిలో వందల కోట్ల సినిమా పెట్టడం సాహసమే కాదు, ఒక రకంగా మార్కెట్ ను దెబ్బతీసుకోవడమే. కథ ఎంత అద్భుతంగా ఉన్నా, దానిని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడి విజన్ చాలా ముఖ్యం. అందులో సదరు దర్శకుడు ఇప్పటికే పూర్తిగా విఫలమయ్యాడు.
కనీసం మినిమం సాంకేతిక నైపుణ్యం కూడా లేకుండా ఒక ఇతిహాసాన్ని ఖూనీ చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడితో సినిమా అనగానే అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు. ‘సినిమా చేయకపోయినా పర్లేదు కానీ, ఈ దర్శకుడితో వద్దు బాబోయ్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వేడుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటికైనా తన అతి మంచితనాన్ని, మొహమాటాన్ని పక్కనపెట్టి, తన స్థాయికి, మార్కెట్ కు తగ్గ సరైన దర్శకులను ఎంచుకోవాలని సినీ విమర్శకులు సైతం సూచిస్తున్నారు. ఈ కాంబినేషన్ వార్త కేవలం రూమర్ గానే మిగిలిపోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



