
చెన్నై, సూర్య న్యూస్ : తమిళ బిగ్‌బాస్ వేదికగా నాయకత్వంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పరోక్షంగా స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేశానంటూ వస్తున్న వార్తలకు ఆయన బ్రేక్ వేశారు. సీఎం విజయ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయనొక ‘క్యూట్ ఫెలో’ అని ప్రశంసించారు. ఇటీవల జరిగిన ‘బత్తా’ సినిమా ఆడియో లాంచ్ వేదికగా సేతుపతి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆశ్చర్యం కలిగించిన సీఎం ఫోన్ కాల్
తాజాగా సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తాను బర్త్ డే విషెస్ చెప్పానని సేతుపతి గుర్తు చేసుకున్నారు. తాను విషెస్ చెప్పిన వెంటనే దళపతి విజయ్ స్వయంగా తనకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారని వెల్లడించారు. “సంజయ్‌కి నువ్వు విషెస్ చెప్పినందుకు వాడు చాలా సంతోషపడ్డాడు మిత్రమా” అని విజయ్ తనతో అన్నారని, ఒక సూపర్ స్టార్ స్థాయిలో ఉండి ఆయన అలా స్పందించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సేతుపతి తెలిపారు. అలాగే జేసన్ సంజయ్ తన యాక్టింగ్‌కు పెద్ద అభిమాని అని తెలిసి చాలా సంతోషించానని ఆయన పేర్కొన్నారు. ‘జననాయగన్’ సినిమా సెట్స్‌లోనూ విజయ్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అసలు వివాదం ఏమిటి?
ప్రస్తుతం విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ తమిళం 10’ షోలో ఇటీవల ఆయన నాయకత్వంపై కొన్ని కామెంట్స్ చేశారు. ఒక నాయకుడు అంటే బాధ్యతగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలపై నెపం నెట్టి పారిపోకూడదని ఒక కంటెస్టెంట్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇటీవల తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌ను ఉద్దేశించే చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విజయ్ మద్దతుదారులు, టీవీకే పార్టీ శ్రేణులు సేతుపతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివాదం ముదరడంతో బిగ్‌బాస్ యాజమాన్యం కూడా ఆ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య తాజాగా దళపతి విజయ్‌పై సేతుపతి చేసిన ప్రశంసలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



