Skip to content
Home » టీ20 వరల్డ్ కప్: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. సూపర్-8లోకి ఘనంగా ఎంట్రీ

టీ20 వరల్డ్ కప్: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. సూపర్-8లోకి ఘనంగా ఎంట్రీ

దాయాదిపై 61 పరుగుల భారీ విజయం.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్

కొలంబో (శ్రీలంక): శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ కీలక విజయంతో భారత జట్టు టోర్నీలో సూపర్-8 దశకు చేరుకుని తన సత్తా చాటింది.

ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) విఫలమైనప్పటికీ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (32), శివమ్ దూబే (27), తిలక్ వర్మ (25) విలువైన పరుగులు జోడించారు.

కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (44) మినహా మిగిలిన వారెవరూ రాణించలేకపోయారు. హార్దిక్ పాండ్య వేసిన బౌలింగ్ లో ఫర్హాన్ (0) పెవిలియన్ చేరగా, అక్షర్ పటేల్ దెబ్బకు బాబర్ ఆజం (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరకు పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది.

బౌలింగ్ గణాంకాలు:

  • భారత్: హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు. తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
  • పాకిస్థాన్: సైమ్ అయూబ్ 3 వికెట్లు తీయగా, సల్మాన్ ఆఘా, ఉస్మాన్ తారిక్ చెరో వికెట్ సాధించారు.

​భవిష్యత్ లో టీమిండియా మరిన్ని విజయాలు సాధించి, భారత పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *