రిపోర్టర్: %author%

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పాల్గొన్న సభ ముగిసిన తర్వాత కొందరు ఆ వేదికను ప్రక్షాళన చేసినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై చర్చించేందుకు సోమవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సమన్వయంతో జరిగిన ఈ భేటీలో లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన దళిత, గిరిజన ఎంపీలు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుడు కె. రాజు, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, సీనియర్ నేత, ఎంపీ కొడికున్నిల్ సురేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఈ ఘటనపై ఉమ్మడి పోరాటం చేయాలని వారు నిర్ణయించారు.
రాష్ట్రపతికి ఫిర్యాదు
ఉత్తరాఖండ్ ఘటనపై భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని ఎంపీలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు దళిత, గిరిజన ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు ఎంపీ మల్లు రవి వెల్లడించారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నామని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా జోక్యం చేసుకోవాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదన
ఈ సమావేశంలో దళిత, గిరిజన వర్గాల హక్కులు, రాజ్యాంగ రక్షణల కోసం భవిష్యత్తులో అనుసరించాల్సిన దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్ పైనా నేతలు చర్చించారు. పార్లమెంట్ లోపలా, బయటా ఈ వర్గాల గౌరవం, ప్రాతినిధ్యం కోసం ఉమ్మడిగా గళం వినిపించేందుకు శాశ్వత వేదికగా “ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ సభ్యుల ఫోరం” ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉత్తరాఖండ్ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని, న్యాయం జరిగే వరకు 32 మంది ఎంపీలు ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



