హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao) సామాజిక జీవితంలో ఒక శిఖరం లాంటి వారని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కొనియాడారు. తెలంగాణ వైతాళికుడు కాళోజీ 112వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విశ్వవిద్యాలయంలో ప్రత్యేక స్మారకోపన్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి, సమాజ అభ్యున్నతి కోసం జీవితాంతం నిరంతరం కృషి చేసిన మహనీయుడు కాళోజీ అని కీర్తించారు. సామాన్య ప్రజల వాడుక భాషనే తన సాహిత్య భాషగా మార్చుకుని ఆయన నిజమైన ప్రజాకవిగా గుర్తింపు పొందారని స్పష్టం చేశారు. ఆయన ఆలోచనలు, రచనలు నేటి యువతరానికి, సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి ప్రశ్నించే ధైర్యాన్ని తన కలాం ద్వారా ప్రజల్లో రగిల్చారని, ప్రజలను చైతన్యపరిచేందుకే విశ్వవిద్యాలయంలో ఇలాంటి స్మారకోపన్యాసాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

తెలంగాణ సాహిత్యానికి బలమైన పునాది
ఈ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు డాక్టర్ కె. శ్రీనివాస్ ప్రధాన వక్తగా పాల్గొని ‘తెలంగాణ సాహిత్యం-ప్రజల గొడవ’ అనే అంశంపై ప్రసంగించారు. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పరితపించిన వ్యక్తి కాళోజీ అని ఆయన గుర్తుచేశారు. సామాజిక అన్యాయాలు, అణచివేతకు వ్యతిరేకంగా కాళోజీ రచించిన కవితలు ప్రజల గొంతుకగా మారాయన్నారు. విప్లవ సాహిత్య ఉద్యమం ఆవిర్భవించడానికి, విస్తరించడానికి ఆయన రచనలు బలమైన పునాదులు వేశాయని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు. 1970ల తర్వాత గద్దర్, చెరబండరాజు, వరవరరావు వంటి వారు కవితలు, పాటల ద్వారా తెలంగాణలో సామాజిక ప్రతిఘటనను బలంగా వినిపించారని వివరించారు. దళిత, స్త్రీవాద, మైనారిటీ సాహిత్య ఉద్యమాలు తెలుగు సాహిత్య పరిధిని మరింత విస్తరించాయన్నారు.

భావితరాలకు వైతాళికుల స్ఫూర్తి
సభకు అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాళోజీ తన జీవితకాలం మొత్తం తెలంగాణ భాష, యాస, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసమే తపించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి వందన సమర్పణ చేయగా.. ప్రొఫెసర్లు ఇ. సుధారాణి, రబింద్రనాథ్ సోలమన్, పల్లవీ కాబడే, రాణి రజిత మాధురి, రజనీ, వెంకట రమణ, పలువురు డీన్స్, డైరెక్టర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు కె. ప్రేమ్ కుమార్, డాక్టర్ యాకేష్ దైదా తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



