|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

Supreme Court of India : కారణం చెప్పకుండా అరెస్ట్ చేస్తే చట్టవిరుద్ధమే.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులు కచ్చితమైన నిబంధనలు పాటించాలని భారత సుప్రీంకోర్టు (Supreme Court of India) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం (Supreme Court Bench) సెప్టెంబర్ 21న వెలువరించిన ఈ తీర్పులో.. తగిన కారణాలు చెప్పకుండా ఎవరినీ అదుపులోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది. నిందితుడిని అరెస్టు చేసేటప్పుడు దానికి గల కారణాలను వారికి అర్థమయ్యే భాషలో తప్పనిసరిగా రాతపూర్వకంగా అందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

అరెస్టులకు గల కారణాలు తెలుసుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) కింద ప్రతి పౌరుడికి ఉందని కోర్టు గుర్తుచేసింది. ఒకవేళ పోలీసులు ఈ నిబంధనను పాటించకపోతే సదరు అరెస్టుతో పాటు రిమాండ్‌ను కూడా పూర్తిగా చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ విధంగా అక్రమంగా డిటెన్షన్ చేసిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని, ఇది బెయిల్ కిందకు రాదని కోర్టు తెలిపింది. ఈ నిబంధనలు ఐపీసీ/బీఎన్ఎస్, పీఎంఎల్‌ఏ, ఉపా (UAPA) సహా అన్ని చట్టాలకు వర్తిస్తాయని, అరెస్టు సమయంలో కారణాలు ఇవ్వకుండా తర్వాత ఛార్జ్‌షీట్ పెట్టినా మొదటి అక్రమ అరెస్టును సమర్థించుకోలేరని తేల్చిచెప్పింది.

పంజాబ్ నేత కేసులో కీలక తీర్పు

పంజాబ్ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ (SAD) నేత జస్కరన్‌జీత్ సింగ్ డియోల్ కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక మైనర్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. రాతపూర్వక కారణాలు ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. గతంలో మిహిర్ రాజేష్ షా కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా బెంచ్ బలపరిచింది.

​రీ-అరెస్ట్‌పై కొత్త నిబంధనలు.. అధికారులపై చర్యలు

రాతపూర్వక కారణాలు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన పోలీసు అధికారిపై నేరుగా డిపార్ట్‌మెంటల్ ఎన్‌క్వైరీకి ఆదేశించడంతో పాటు, వారి సర్వీస్ రికార్డ్‌లో ఆ విషయాన్ని నమోదు చేయాలని సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు కాపీలను అన్ని రాష్ట్రాల డీజీపీలకు పంపాలని ఆదేశించింది. కాగా, సరైన కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేసి విడిచిపెట్టిన తర్వాత, తిరిగి అదే వ్యక్తిని రీ-అరెస్ట్ చేయాలంటే పాత దర్యాప్తు అధికారి (IO)కి అధికారం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. మళ్లీ అరెస్ట్ చేయాలంటే ముందుగా రాతపూర్వక కారణాలు సిద్ధం చేసి, సీనియర్ అధికారుల ఆమోదంతో పాటు మేజిస్ట్రేట్ అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని, దర్యాప్తును సైతం వేరే అధికారికి అప్పగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp