
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ఆధ్వర్యంలో బుధవారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS Academy) అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్లౌడ్ నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక విద్యను అందించడం ద్వారా తక్షణ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే అంశాలపై విద్యావేత్తలు, సంస్థాగత భాగస్వాములు కీలక చర్చలు జరిపారు.
అమెజాన్‌తో భాగస్వామ్యం.. నిరుద్యోగులకు ఉపాధి
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసుకుని సరైన ఉపాధి లేని నిరుద్యోగ పట్టభద్రుల కోసం ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ ప్రోగ్రామ్‌తో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రతిపాదించారు. అమెజాన్ సంస్థకు భారీ స్థాయిలో గిడ్డంగులు ఉన్నందున, వాటి నిర్వహణకు అవసరమైన వేర్‌హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ కోర్సులను విద్యార్థులకు అందిస్తే వారికి సులభంగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ఏడబ్ల్యూఎస్ బృందాన్ని కోరారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నైపుణ్యాలు అత్యంత కీలకం కానున్నాయని ఆయన స్పష్టం చేశారు.

గ్లోబల్ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణ
ఈ సదస్సులో ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ విభాగాధిపతి తేజస్ వాషి, భారత్ స్కిల్లింగ్ కంట్రీ మేనేజర్ ప్రతిభా సింగ్, సైయెంట్ ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ కృష్ణ దీవి పాల్గొన్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా క్లౌడ్ కంప్యూటింగ్, నూతన సాంకేతిక నైపుణ్యాల గురించి వారు అధ్యాపకులకు వివరించారు. సైన్స్, టెక్నాలజీ (స్టెమ్) విభాగాలతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కూడా ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వొకేరియం వేదిక ద్వారా విద్యార్థులు ప్రయోగాత్మక ల్యాబ్స్, ప్రాజెక్టులలో పాల్గొని ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చని వెల్లడించారు.
సదస్సుకు విశేష స్పందన
ఉన్నత విద్యాసంస్థలు ఏడబ్ల్యూఎస్ అకాడమీలో చేరేందుకు కావాల్సిన అర్హతలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అధ్యాపకుల గుర్తింపు తదితర అంశాలపై ఈ సదస్సులో పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల అధ్యాపకులు, డీన్లు, డైరెక్టర్లు విశేషంగా హాజరై తమ ఆసక్తిని కనబరిచారు. సార్వత్రిక, దూరవిద్యా విధానం ద్వారా అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ఈ తరహా క్లౌడ్ నైపుణ్యాలు అద్భుతమైన కెరీర్‌ను అందిస్తాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



