
ముంబై, సూర్య న్యూస్ : బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. భారత పౌరసత్వం లేనప్పటికీ, ముంబైలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆందోళనల్లో ఆయన పాల్గొనడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అసలు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో, అందులోనూ సెన్సిటివ్ రాజకీయ అంశాల్లో ఒక విదేశీయుడు తలదూర్చడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయన కేవలం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుతో మాత్రమే దేశంలో నివసిస్తున్నారు. OCI కార్డుదారులు విదేశీయులేనని, వారికి భారత పౌరుల హక్కులు వర్తించవని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. ఓటు వేసేందుకు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైనప్పుడు.. ఇక్కడి ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలంటూ జరిగే ఆందోళనల్లో ఒక అమెరికన్ పౌరుడు ఎందుకు పాల్గొన్నారనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం.
సినిమాలు చేసుకుంటే మంచిది కాదా?
ఒక నటుడిగా సినిమాల్లో నటించడం, కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇక్కడి రాజకీయ వ్యవస్థపై, ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేదా పౌరసత్వం లేని వ్యక్తి నిరసనల్లో పాల్గొని ప్రజలను రెచ్చగొట్టడం ఏ చట్టం ప్రకారం కరెక్ట్ అని నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఓసీఐ నిబంధనలు, వీసా షరతులను ఉల్లంఘించి రాజకీయ ఆందోళనల్లో పాల్గొనడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ఒక విదేశీయుడిగా తన పరిధి దాటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత కిరీట్ సోమయ్య సైతం ఇమ్రాన్ చర్యలను ‘రాజకీయ తీవ్రవాదం’గా అభివర్ణిస్తూ ఫిర్యాదు చేశారు.
దేశం విడిచి వెళ్లాలని నోటీసులు
ఆగస్టు క్రాంతి మైదాన్లో జరిగిన సీజేపీ ప్రొటెస్టుల్లో పాల్గొన్నందుకుగాను, ఇమ్రాన్ ఖాన్ను అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు (FRRO) నోటీసులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ చట్టం కింద ఆయనపై చర్యలు ప్రారంభించారు. పౌరసత్వం లేని వ్యక్తి భారతీయ ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొంటే ఇలాంటి కఠిన చర్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు సమర్థిస్తున్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఈ నోటీసులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. దేశ సార్వభౌమాధికారం, ఇక్కడి చట్టాల పట్ల ఒక విదేశీయుడిగా ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరు మాత్రం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



